హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కోఠి ఆంధ్రాబ్యాంకు కూడలి వద్ద శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. తొలుత బ్యాంక్ దగ్గరలోని ఓ వస్త్ర దుకాణంలో ఒక్కసారిగా మంటలు చేలరేగి.. పక్కనే ఉన్న మరో ఐదు దుకాణాలకు వ్యాపించాయి. అవి అన్ని బట్టల దుకాణాలు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. షాపులు మూసివేసిన యజమానులు ఇంటికి వెళ్లిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆయా షాపుల్లోని బట్టలు అగ్నికి ఆహుతయ్యాయి.
ప్రమాదం గురించి తెలుసుకున్న ఆషాపు యజమానులు ఘటనా స్థలానికి చేరుకొని అగ్నికి ఆహుతవుతున్న తమ షాపులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఒక దశలో మంటల్లో కాలిపోతున్న దుస్తుల్ని బయటికి తీసుకువచ్చేందుకు ఆ షాపుల యజమానులు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి పంపించివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి.. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
40 ఏళ్లుగా కోఠిలోనే బట్టల దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నామని, ప్రమాదంతో తాము అన్నీ కోల్పోయి పూర్తిగా రోడ్డున పడ్డామని షాపుల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా..? లేదా ఇంకా ఏమన్నా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.