ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్ర‌మాదం.. కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్‌.. ఆరుగురు మృతి.. సీఎం జ‌గ‌న్ దిగ్భ్రాంతి

Major Accident in chemical factory 6 killed.ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఓ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 April 2022 8:31 AM IST
ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్ర‌మాదం.. కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్‌.. ఆరుగురు మృతి.. సీఎం జ‌గ‌న్ దిగ్భ్రాంతి

ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఓ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లో రియాక్ట‌ర్ పేల‌డంతో మంట‌లు ఎగిసిప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెంద‌గా.. మ‌రో 12 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి.

వివ‌రాల్లోకి వెళితే.. ముసునూరు మండ‌లం అక్కిరెడ్డిగూడెంలోని పోర‌స్ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలోని నాలుగో యూనిట్‌లో బుధ‌వారం అర్థ‌రాత్రి స‌మ‌యంలో పెద్ద శ‌బ్ధంతో రియాక్ట‌ర్ పేలిపోయింది. దీంతో ఉవ్వెత్తున మంట‌లు ఎగిసిప‌డ్డాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క, పోలీస్‌, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. దాదాపు రెండు గంట‌ల పాటు శ్ర‌మించిన అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చాయి. మంట‌ల్లో చిక్కుకుని ఐదుగురు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. మ‌రో 13 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిని తొలుత నూజివీడు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం మెరుగైన చికిత్స కోసం విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు. అయితే.. మార్గ‌మ‌ధ్యంలోనే మ‌రో వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు.

కాగా.. ఘ‌ట‌న జ‌రిగిన పరిశ్రమలో ఔషధాల తయారీకి అవసరమైన పొడిని ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో రియాక్ట‌ర్‌కు స‌మీపంలో ఇద్దరు కెమిస్టులు, 16 మంది కార్మికులతో క‌లిపి మొత్తం 18 మంది ఉన్నారు. మృతుల్లో ఇద్ద‌రు స్థానికులు కాగా.. మిగిలిన వారు బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. క్ష‌త‌గాత్రుల్లో సైతం బీహారీలే అధికంగా ఉన్నారు.

70 శాతం కాలిన గాయాలు..

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 13 మందిని విజయవాడ ప్రభుత్వ ఆస్ప‌త్రికి తీసుకొచ్చారని ఆస్ప‌త్రి సూపరింటెండెంట్‌ సౌభగ్య లక్ష్మి తెలిపారు. వారిలో ఒక‌రు మార్గ‌మ‌ధ్యంలోనే మ‌ర‌ణించార‌ని, మిగిలిన 12 మందికి చికిత్స అందిస్తున్న‌ట్లు చెప్పారు. 70 శాతానికి పైగా కాలిపోయార‌ని, ఒక్క‌రి ప‌రిస్థితి మెరుగ్గా ఉండ‌గా.. మిగిలిన అంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలిపారు.

భారీ శబ్ధం వచ్చింది..

ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సూపర్‌వైజర్‌ రాజు స్పందిస్తూ.. ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా భారీ శబ్ధం వచ్చింది. చూసేసరికి ఫ్యాక్టరీ మొత్తం మంటలు అలుముకున్నాయి. కింది విభాగంలో పనిచేస్తున్న అందరం బయటకు పరుగులు తీశాం. పైవిభాగంలో పనిచేస్తున్న కొంతమంది మంటల్లో సజీవదహనమయ్యారు. ప్యాక్టరీలో ఎప్పుడూ ఇలాంటి ప్రమాదం జరగలేదు అని చెప్పాడు.

సీఎం జ‌గ‌న్ దిగ్భ్రాంతి

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాల‌కు రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారంగా ప్రకటించారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని, ఘ‌ట‌న‌పై పూర్తి దర్యాప్తు చేయవల్సిందిగా జిల్లా కలెక్టర్ ను, ఎస్పీని ఆదేశించారు.

Next Story