ఆస్ట్రేలియన్‌ పిస్టల్‌తో చంపార‌ట‌.. బాబా సిద్ధిఖీ హత్య కేసు ప్రధాన నిందితుడు అరెస్ట్‌

మహారాష్ట్ర ప్రభుత్వ మాజీ మంత్రి, సినీ నటుడు సల్మాన్‌కు సన్నిహితుడు జియావుద్దీన్ అలియాస్ బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్ గౌతమ్ అలియాస్ శివను ఉత్తరప్రదేశ్ STF, ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం బహ్రైచ్‌లో అరెస్టు చేసింది.

By Kalasani Durgapraveen  Published on  11 Nov 2024 6:52 AM GMT
ఆస్ట్రేలియన్‌ పిస్టల్‌తో చంపార‌ట‌.. బాబా సిద్ధిఖీ హత్య కేసు ప్రధాన నిందితుడు అరెస్ట్‌

మహారాష్ట్ర ప్రభుత్వ మాజీ మంత్రి, సినీ నటుడు సల్మాన్‌కు సన్నిహితుడు జియావుద్దీన్ అలియాస్ బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్ గౌతమ్ అలియాస్ శివను ఉత్తరప్రదేశ్ STF, ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం బహ్రైచ్‌లో అరెస్టు చేసింది. శివ నేపాల్‌కు పారిపోవడానికి సహకరించినందుకు మరో నలుగురిని కూడా అరెస్టు చేశారు.

శివకుమార్ గౌతమ్ అలియాస్ శివ తన సహచరులతో కలిసి మూడు రోజుల పాటు బాబా సిద్ధిఖీని రెక్కీ చేసి.. దసరా రోజున అవకాశం వచ్చిన వెంటనే అతనిని హత్య చేసినట్లు ఎస్టీఎఫ్‌కి తెలిపినట్లు వర్గాలు తెలిపాయి. ఇద్దరు హత్యకేసు నిందితులను అక్కడికక్కడే ప్రజలు పట్టుకున్నారు.. శివ తన ఫోన్‌ను విసిరివేసి అక్కడి నుండి పూణేకు పారిపోయాడు. పూణే నుంచి ఝాన్సీ, లక్నో మీదుగా బహ్రైచ్‌కు వెళ్లిన‌ట్లు విచార‌ణ‌లో తెలిపాడు.

దారిలో అనురాగ్ కశ్యప్‌తో ఒక ప్రయాణికుడి ఫోన్ ద్వారా మాట్లాడినప్పుడు.. అఖిలేంద్ర, జ్ఞాన్ ప్రకాష్, ఆకాష్ నేపాల్‌లో తలదాచుకోవడానికి ఏర్పాట్లు చేశారని చెప్పాడు. తాను, మరో షూటర్‌ ధరమ్‌రాజ్‌ ఒకే ఊరి నివాసితులని శివ చెప్పాడు. ముంబైలో స్క్రాప్ వ్యాపారం చేసేవాడు. అతని, శుభం లోంకర్ దుకాణాలు పక్కపక్కనే ఉన్నాయని చెప్పాడు. శుభమ్ స్నాప్ చాట్ ద్వారా లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌తో మాట్లాడేలా చేశాడు. హత్యకు పది లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చాడు. హత్యానంతరం కూడా ప్రతినెలా కొంత మొత్తం వస్తుందన్నారు. హత్య చేసేందుకు శుభం, యాసిన్ తనకు ఆయుధాలు, మొబైల్ ఫోన్లు, సిమ్‌లు అందించారని చెప్పాడు. హత్య అనంతరం మాట్లాడేందుకు విడివిడిగా మొబైల్ ఫోన్లు, సిమ్ లు కూడా ఇచ్చారని చెప్పాడు.

అక్టోబర్ 12 దసరా రోజున ముగ్గురు ముష్కరులు బాబా సిద్ధిఖీని కాల్చిచంపారు. హత్యకు ఆస్ట్రేలియాలో తయారైన పిస్టల్‌ను ఉపయోగించారు. హ‌త్య‌ తరువాత ముంబై పోలీసులు ఇద్దరు నిందితులు ధరమ్‌రాజ్ కశ్యప్, గుర్‌మైల్ సింగ్‌లను అరెస్టు చేశారు, అయితే శివ బహ్రైచ్‌కు పారిపోయాడు. లారెన్స్ బిష్ణోయ్ సూచనల మేరకే బాబా సిద్ధిఖీని హత్య చేశామని అరెస్టయిన నిందితులు పోలీసులకు చెప్పారు.

మహారాష్ట్రకు చెందిన శుభమ్ లోంకర్, పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన మహ్మద్ యాసిన్ అక్తర్ షూటర్ల హ్యాండ్లర్లు. బాబా సిద్ధిఖీ హత్యకు లొకేషన్, ఆయుధాలను షూటర్లకు అందించాడు. పట్టుబడిన ముష్కరులిద్దరూ శివ గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీని తరువాత, ముంబై పోలీసులు శివను అరెస్టు చేయడానికి STF నుండి సహకారం కోరారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం లక్నోకు వచ్చి STF తో పాటు శివ ఉన్న ప్రదేశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. బహ్రైచ్‌లోని నాన్‌పరాలో శివ ఉన్న స్థానాన్ని కనుగొన్నారు. అతడు నేపాల్‌కు పారిపోయేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు ఎస్టీఎఫ్‌కు సమాచారం అందింది. దీంతో STF బృందం అతన్ని నాన్‌పరాలో అరెస్టు చేసింది.

Next Story