విషాదం.. తండ్రి స్నాప్‌చాట్‌ వద్దన్నాడని బాలిక సూసైడ్

ఈ మధ్యకాలంలో యువత చిన్న చిన్న విషయాలకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

By Srikanth Gundamalla  Published on  24 Jun 2024 10:55 AM IST
Maharashtra, girl, suicide, father,  snapchat,

విషాదం.. తండ్రి స్నాప్‌చాట్‌ వద్దన్నాడని బాలిక సూసైడ్

ఈ మధ్యకాలంలో యువత చిన్న చిన్న విషయాలకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చదువులో మార్కులు తక్కువ వచ్చాయనీ కొందరు బలవన్మరణాలకు పాల్పుడుతుంటే.. ఇంకొందరు అడిగి వస్తువులు కొనివ్వడం లేదనీ సూసైడ్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనా చివరకు తల్లిదండ్రులకు చివరకు గుండెకోతను మిగిల్చి పోతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఓ బాలిక చిన్న కారణానికి ఆత్మహత్య చేసుకుంది.

సెల్‌ఫోన్లలో చాలా మంది స్నాప్‌చాట్‌ను ఉపయోగిస్తుంటున్నారు. మహారాష్ట్రలోని థానె పరిధిలో ఉన్న డోంబీవిలీ ప్రాంతంలో ఒక బాలికను స్నాప్‌చాట్ వాడొద్దని ఆమె తండ్రి సూచించాడు. ఒకటికి రెండు సార్లు చెప్పాడు. అయితే.. ఆ అమ్మాయి మాత్రం స్నాప్‌ చాట్‌ను తన తండ్రిని కాదని ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసేందుకు ప్రయత్నం చేసింది. ఆ తండ్రి ఇది గమనించి బాలికను ససేమిరా అన్నాడు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దంటే వినవా అంటూ కొంచెం సీరియస్ అయ్యాడు. అంతే.. తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక.. రాత్రి తన గదిలో ఉండి తలుపులు వేసుకుంది.

తండ్రి కూడా పెద్దగా పట్టించుకోలేదు. అలిగిందిలే అనుకుని వదిలేశాడు. అయితే.. ఆ బాలిక ఈ చిన్న విషయానికే కఠిన నిర్ణయం తీసుకుంది. తన గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరుసటి రోజు ఎంతకీ బాలిక బయటకు రాకపోవడంతో తండ్రికి అనుమానం వచ్చి డోర్లను పగలగొట్టి లోపలికి వెళ్లాడు. అప్పటికే తాడుకి వేలాడుతున్న కూతురు మృతదేహాన్నిచూశాడు. దాంతో.. కన్నీరుమున్నీరులా విలపించాడు. ఇక ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Next Story