టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య
Mahabubabad Councilor Banoth Ravi Murdered.మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మహబూబాబాద్ మున్సిపాలిటీ 8వ
By తోట వంశీ కుమార్ Published on 21 April 2022 9:03 AM GMT
మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మహబూబాబాద్ మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ట్రాక్టర్ తో ఢీకొట్టి, గొడ్డలితో నరికి గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్యకు పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ మున్సిపాలిటీ 8వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోతు రవి (32) మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడి బైక్‌పై పత్తిపాకలోని తన స్నేహితుడి నివాసానికి బయలుదేరాడు. స్నేహితుడి ఇంటి సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్ తో రవి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో రవి కిందపడ్డాడు. అనంతరం మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో ఆయనపై దాడి చేసి పరారయ్యారు.
ఈ ఘటనలో రవికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బందువులు, స్థానికులు ఏరియా ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేపట్టారు. పాత కక్షలే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కౌన్సిలర్ మృత దేహాన్ని ఎంపీ మాలోత్ కవిత, డీసీసీ అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి పరిశీలించారు.