తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో అందరూ చూస్తుండగానే ఘోరం జరిగింది. బాండీలో జావ మరుగుతుండగా ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు. చుట్టు ప్రక్కల వారు గమనించి అతడిని రక్షించారు. అయితే..ఈ ఘటన విషాదాంతంగా ముగిసింది.
వివరాల్లోకి వెళితే.. 'ఆడి వెల్లి' అనేది తమిళనాడు అంతటా జరుపుకునే ముఖ్యమైన పండుగ, ఇక్కడ అమ్మాన్ గౌరవార్థం గంజి వండి ప్రజలకు పంపిణీ చేస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం(జూలై 29) మధురైలోని పజంగనాథంలో ముత్తు మరియమ్మ ఆలయ భక్తుల కోసం పెద్ద పాత్రల్లో గంజి వండుతున్నారు. గంజి తయారీలో సహకరిస్తున్న ముత్తుకుమార్ అనే బాధితుడు కళ్లు తిరగడంతో మరుగుతున్న గంజి ఉన్న పెద్ద పాత్రలో పడిపోయాడు.
షాక్‌కు గురైన చుట్టుపక్కల వారు ముత్తుకుమార్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించారు. అతడిని రక్షించే క్రమంలో పాత్రను పక్కకు దొర్లించారు. వెంటనే అతడిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. 65 శాతం గాయాలతో చికిత్స పొందుతూ మంగళవారం(ఆగస్టు 2న) మరణించాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
https://youtu.be/mVHLC5DaGSo