స్పెల్లింగ్ చెప్పలేదని.. ఐదేళ్ల చిన్నారి చేయి విరిచిన టీచర్
Madhya Pradesh Tuition Teacher breaks hand of 5yr old girl for spelling mistake. ఓ ట్యూషన్ టీచర్ 5 ఏళ్ల బాలికను కొట్టడంతో ఆమె చేయి విరిగింది.
By అంజి Published on 29 Dec 2022 9:13 AM GMTఇటీవల కాలంలో ఉపాధ్యాయులు.. చిన్న చిన్న విషయాలకే పిల్లలను కొడుతున్నారు. దీని కారణంగా పిల్లలు తీవ్రంగా గాయపడుతున్నారు. తాజాగా అలాంటి ఉదంతమే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ట్యూషన్ టీచర్ 5 ఏళ్ల బాలికను కొట్టడంతో ఆమె చేయి విరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు గురువారం సమాచారం అందించారు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు 22 ఏళ్ల టీచర్‌ను అరెస్ట్ చేశారు. హబీబ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ మనీష్ రాజ్ సింగ్ భదౌరియా మాట్లాడుతూ.. బాలిక చిలుక (స్పెల్లింగ్) పదం అక్షరాలు చెప్పకపోవడంతో టీచర్ ప్రయాగ్ విశ్వకర్మకు కోపం వచ్చింది. అంతే ఆ కోపంతో ఆ అమ్మాయి చేయి విరిచేశాడు.
ఈ ఘటన జరిగినప్పటి నుంచి బాలిక కుడిచేతిలో తీవ్రమైన ఫ్రాక్చర్ ఏర్పడిందని చిన్నారులపై నేరాలకు సంబంధించిన ఎన్జీవో చైల్డ్‌లైన్ డైరెక్టర్ అర్చన సహాయ్ తెలిపారు. బాలికను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె బహుశా గురువారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్లు, జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద టీచర్‌పై అభియోగాలు మోపినట్లు ఇన్‌స్పెక్టర్ భదౌరియా తెలిపారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మంగళవారం అరెస్టు చేశామన్నారు.
బాలిక తల్లిదండ్రులు హబీబ్‌గంజ్‌లోని తమ ఇంటికి సమీపంలో నివసించే ట్యూటర్‌ను తమ కుమార్తెను పాఠశాల ప్రవేశ పరీక్షకు సిద్ధం చేసేందుకు నియమించుకున్నారని పోలీసులు తెలిపారు. బాలిక చదువుకోవడానికి టీచర్ ఇంటికి వెళ్లేది. ఇలా విద్యార్థులపై ఉపాధ్యాయుల కోప ప్రతాపం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. గత నెలలో హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఓ పాఠశాలలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. డిపిఎస్ స్కూల్ సెక్టార్-11లో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది.