టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు... ఆ 18 మంది ఎవరు?
హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ బ్యూరో విచారణ కొనసాగించిన కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
By అంజి Published on 1 Sept 2023 10:52 AM IST
టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు... ఆ 18 మంది ఎవరు?
హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ బ్యూరో విచారణ కొనసాగించిన కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న మాదాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నా సినీ నిర్మాత వెంకట్‌తో పాటు మరో ఐదుగురిని నార్కోటిక్ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సినీ ఫైనాన్సర్ వెంకట్ వాట్సాప్‌లో కీలక విషయాలు బట్టబయలు అయ్యాయి. ఇప్పటికే బాలాజీ, వెంకట్ ఇద్దరు కలిసి డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. బెంగళూరు, గోవా నుండి డ్రగ్స్‌ని హైదరాబాద్ తీసుకువచ్చి పలువురికి విక్రయిస్తూ రేవు పార్టీలు నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు.
ముఖ్యంగా వెంకట్ నైజీరియా నుండి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాదులో వీకెండ్‌లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. ఈ పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. ఇప్పటివరకు బాలాజీ, సినీ నిర్మాత వెంకట్ 18 మందికి డ్రగ్స్ విక్రయించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆ 18 మంది ఎవరు అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. గతంలో సినీ నిర్మాత కృష్ణ ప్రసాద్ అరెస్ట్ అయిన తర్వాత మరోసారి టాలీవుడ్ లో ప్రకంపనలు చెలరేగాయి. ఇప్పటికే కృష్ణ ప్రసాద్ లిస్టులో సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు, ఇతర రంగాల వ్యక్తులకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
కృష్ణ ప్రసాద్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరి పేర్లు జాబితాను అప్పట్లో సిద్ధం చేశారు. విధంగా కృష్ణ ప్రసాద్ వ్యవహారంలో దర్యాప్తుకు సిద్ధమైన సమయంలో పై నుండి పోలీసులకు ఒత్తిడి రావడంతో కృష్ణ ప్రసాద్ వ్యవహార విచారణ నిలిచిపోయింది. ఇప్పుడు మరో నిర్మాత డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో సినీ పరిశ్రమలో గుబులు పుట్టుకొస్తుంది. అయితే కృష్ణ ప్రసాద్ తో సినీ ఫైనాన్సర్ వెంకట్‌కు, బాలాజీకి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో నార్కోటిక్ బ్యూరో పోలీసులు విచారణ కొనసాగించారు. ఇదిలా ఉండగా మరోవైపు మరోసారి నిందితుల్ని కస్టడీ లోకి తీసుకొని విచారణ చేయాలని నార్కోటిక్ బ్యూరో భావిస్తున్నారు. ఏది ఏమైనాపటికి సినీ నిర్మాతలు డ్రగ్స్ కేసులో పట్టుబడడంతో సినీ పరిశ్రమలో హల్చల్ రేగుతుంది.