ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణం జరిగింది. సుమారు రూ. 1 లక్ష 50 వేల విలువైన స్మార్ట్‌ఫోన్‌ను డెలివరీ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వాల్సింది పోయి.. ఏజెంట్‌ను కస్టమర్, అతడి స్నేహితుడు గొంతు కోసి చంపారు. డెలివరీ ఏజెంట్‌ను కస్టమర్ ఇంటికి రప్పించి గొంతు కోసి చంపినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు భరత్ ప్రజాపతిని నిందితులు గజానన్, అతని సహచరుడు ఆకాష్ సెప్టెంబర్ 23 న హత్య చేశారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ శశాంక్ సింగ్ ప్రకారం.. ఇద్దరూ అతని మృతదేహాన్ని ఇందిరా కెనాల్‌లో పారవేసారు.
ఫ్లిప్‌కార్ట్ నుండి మరో నిందితుడు హిమాన్షు కనౌజియా ఆర్డర్ చేసిన గూగుల్ పిక్సెల్, వివో ఫోన్‌లను నగరంలోని చిన్‌హాట్ ప్రాంతంలోని కనౌజియా ఇంటికి డెలివరీ చేయడానికి భరత్ వెళ్లిన తర్వాత ఈ సంఘటన జరిగింది. కనౌజియా క్యాష్ ఆన్ డెలివరీ చెల్లింపు విధానాన్ని ఎంచుకున్నాడు.
భరత్ ప్రజాపతి తిరిగి ఇంటికి రాకపోవడంతో, అతడు అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి అతని కాల్ రికార్డుల ద్వారా గజానన్ నంబర్‌ను గుర్తించారు. విచారణలో, గజానన్ స్నేహితుడు, ఆకాష్, నేరాన్ని అంగీకరించాడు. ఇద్దరు భరత్ ప్రజాపతి నుండి విలువైన స్మార్ట్‌ఫోన్‌లను దోచుకోవడానికి ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. భరత్ ప్రజాపతిని కనౌజియా ఇంటికి రప్పించిన తర్వాత, వారు అతనిపై దాడి చేసి గొంతు కోసి చంపారు. అనంతరం అతడి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ఇందిరా కాలువలో పడేశారు. రాష్ట్ర విపత్తు రెస్పాన్స్ ఫోర్స్ సహాయంతో పోలీసులు మృతదేహం కోసం వెతుకుతున్నారు.
కనౌజియా,ఆకాష్ అరెస్టయ్యారు, కానీ గజానన్ పరారీలో ఉన్నాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) ప్రస్తుతం కాలువలో సాహు మృతదేహం కోసం వెతుకుతోంది.