బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. లక్నోకు చెందిన ఓ మహిళా దంతవైద్యురాలు ఇక్కడి ఆస్పత్రిలో సహోద్యోగి నిత్యం వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ప్రియాంషీ త్రిపాఠి ఎంఎస్ రామయ్య మెమోరియల్ ఆసుపత్రిలో డెంటిస్ట్‌గా పని చేసేది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే ఆసుపత్రిలో పనిచేసిన సుమిత్‌గా గుర్తించబడిన ఆమె సహోద్యోగి ఆమెను ప్రేమించాలంటూ వేధింపులకు గురి చేశాడు. అయితే ప్రియాంషి త్రిపాఠి అందుకు అంగీకరించలేదు.
బాధితురాలిని పెళ్లి చేసుకోమని సుమిత్ బలవంతం చేశాడని, మద్యం, ధూమపానం చేయమని బలవంతం చేశాడని పోలీసులు తెలిపారు. డబ్బు ఇవ్వాలని సదరు మహిళా డెంటిస్ట్‌ని నిందితుడు వేధించాడు. అయితే అతని అభ్యర్థనలన్నింటినీ ఆమె తిరస్కరించిందని పోలీసులు తెలిపారు. దీంతో కోపోద్రిక్తుడైన సుమిత్ ఆసుపత్రిలో బాధితురాలి పాత్ర గురించి పుకార్లు వ్యాప్తి చేసాడు. ఆమె వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేశాడు. దాని తర్వాత ఆమె తీవ్ర చర్య తీసుకుంది. ఈ ఘటన జనవరి 25న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రియాంషి త్రిపాఠి తండ్రి సుశీల్ త్రిపాఠి ఫిర్యాదు మేరకు సంజయ్ నగర్ పోలీసులు ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.