వారి వరుసలు మరిచారు.. ప్రాణాలు తీసుకున్నారు
Lovers suicide in Krishna district.వారిద్దరు వరుసకు అన్నా చెల్లెళ్లు అవుతారు. తెలిసీ తెలియని వయసులో వావివరుస మరిచి
By తోట వంశీ కుమార్ Published on 31 May 2021 8:44 AM ISTవారిద్దరు వరుసకు అన్నా చెల్లెళ్లు అవుతారు. తెలిసీ తెలియని వయసులో వావివరుస మరిచి ఆకర్షణకు లోనై.. అదే ప్రేమ అనుకున్నారు. చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చారు. ఈ ఘటన మోపిదేవి మండలంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ యువకుడు(22), తొమ్మిదో తరగతి చదువుతున్న (15) ఓ బాలిక ప్రేమించుకుంటున్నారు. వారిద్దరి ఇంటి పేరు ఒకటే కావడంతో వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. వారి ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచారు. చివరకు ఈ విషయం వారి ఇళ్లలో తెలిసింది. దీంతో వారిద్దరిని.. ఇది తప్పు అంటూ తల్లిదండ్రులు మందలించారు. ఈ క్రమంలో శనివారం రాత్రి అందరూ నిద్రలో ఉండగా.. వారిద్దిరూ ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఉరి చివర ఉన్న పొలాల్లోని ఓ చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
మెలకువ వచ్చిన వారి తల్లిదండ్రులు వారు లేకపోవడాన్ని గమనించారు. వారిద్దరి కోసం గాలించగా ప్రయోజనం లేకుండా పోయింది. ఆదివారం ఉదయం పెదకళ్లేపల్లి శివారు చల్లపల్లి రోడ్డు పొలంలో వేప చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ విగతజీవులుగా ఉన్న వారిని పశువుల కాపరులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.