ప్రియురాలిని చంపిన ప్రియుడు..!
Lovers suicide attempt in Chandanagar.పెళ్లికి పెద్దలు నిరాకరించారని ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే..
By తోట వంశీ కుమార్ Published on 26 Oct 2021 11:11 AM ISTపెళ్లికి పెద్దలు నిరాకరించారని ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే.. ప్రియురాలు మృతి చెందగా.. ప్రియుడు గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా కరవాడి ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు కుమారై నాగచైతన్య (24), గుంటూరు జిల్లా రెంటచింతల మండలం రెంట్యాలకు చెందిన గాదె కోటిరెడ్డి ప్రేమించుకున్నారు. నాగ చైతన్య ఓ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తుండగా.. కోటిరెడ్డి మెడికల్ రిప్రజంటెటీవ్‌గా పనిచేస్తున్నాడు.
ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. అప్పటి నుంచి నాగచైతన్య హైదరాబాద్ కు వచ్చి నల్లగండ్లలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 22న కోటిరెడ్డి హైదరాబాద్‌కు వచ్చాడు. 23న ఇద్దరు కలిసి ఆస్పత్రికి దగ్గరలో ఓయోలో గదిని అద్దెకు తీసుకున్నారు. ఈనెల 24న(ఆదివారం) రాత్రి వరకు వీరు గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఓయో సిబ్బంది గదిని పరిశీలించగా.. నాగచైతన్య రక్తపు మడుగులో పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే.. కోటిరెడ్డి గాయాలతో ఒంగోలు ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులకు సమాచారం అందింది.
ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇద్దరం చనిపోవాలని అనుకున్నామని.. ఈ క్రమంలో నాగచైతన్య కత్తితో గొంతుపై, కడుపులో పొడుచుకుని పడిపోయింది. తాను కూడా గొంతు మీద పొట్టలో పొడుచుకున్నా పడిపోయానని.. ఉదయం 10.30గంటల సమయంలో తనకు మెలకుళ వచ్చి చూసే సరికి నాగచైతన్య స్పృహలో లేదని కోటిరెడ్డి చెబుతున్నాడు. ఫ్యానుకు ఉరేసుకునేందుకు విఫలయత్నం చేశానని.. భయంతో రెంట్యాలలోని ఇంటికి వచ్చానని చెప్పాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు.
కాగా.. ఓయో గదిని పరిశీలించగా గదిలో మద్యం సీసాలతో పాటు రక్తం మడుగును కడగడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోందని పోలీసులు తెలపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారిద్దరూ నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారా..? లేక ఆమెను హత్య చేసి కోటిరెడ్డి అబద్దం చెబుతున్నాడా..? అన్నది విచారణలో తేలనుంది.