సుద్ద‌ప‌ల్లి రైల్వేగేటు వ‌ద్ద ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌.. కార‌ణం అదేనా..!

రైలు కింద ప‌డి ప్రేమికులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న చేబ్రోలు మండ‌లం సుద్ధ‌ప‌ల్లి రైల్వేగేటు వ‌ద్ద‌ చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 March 2023 3:00 PM IST
Guntur, crime news

రైలు ప‌ట్టాలు ప్ర‌తీకాత్మ‌క చిత్రం



ఇటీవ‌ల కాలంలో చిన్న చిన్న కార‌ణాల‌కే యువ‌త ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. త‌ల్లిదండ్రులు మంద‌లించార‌నో, మార్కులు త‌క్కువ‌గా వ‌చ్చాయ‌నో, త‌మ ప్రేమ‌కి పెద్ద‌లు ఒప్పుకోలేద‌నో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. త‌మ ప్రేమ‌ను పెద్ద‌లు కాద‌న్నార‌ని రైలు కింద ప‌డి ప్రేమికులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండ‌లం సుద్ధ‌ప‌ల్లి రైల్వేగేటు వ‌ద్ద‌ చోటు చేసుకుంది.

సెల‌పాడు గ్రామంలో శ్రీకాంత్ అనే యువ‌కుడు నివ‌సిస్తున్నాడు. అదే గ్రామంలో ఉంటున్న త్రివేణి యువ‌తితో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ఎంతో ఇష్ట‌ప‌డుతున్నారు. కాగా.. రెండు రోజు క్రితం త్రివేణి తెనాలిలోని డిగ్రీ కాలేజీ వెళ్లింది. ఆ త‌రువాత శ్రీకాంత్ తో వెళ్లిపోయింది. దీన్ని గ‌మ‌నించిన ఆమె స్నేహితురాలు త్రివేణి త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం ఇచ్చింది.

త్రివేణి కోసం వెతుక‌క‌గా ఎక్క‌డా ఆమె జాడ తెలియ‌రాలేదు. దీంతో మంగ‌ళ‌వారు వారు చేబ్రోలు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో సుద్ద‌ప‌ల్లి రైల్వేగేటు వ‌ద్ద మృత‌దేహాల‌ను ప‌డి ఉండ‌డాన్ని గ్యాంగ్‌మెన్ గుర్తించారు. పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

పోలీసులు త్రివేణి త‌ల్లిదండ్రులు స‌మాచారం ఇవ్వ‌గా.. అక్క‌డ‌కు చేరుకున్న వారు మృతిచెందింది త‌మ కూతురేన‌ని నిర్థారించుకుని క‌న్నీరు మున్నీరుగా విల‌పించారు. కేసు న‌మోదు చేసిన తెనాలి రైల్వే పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story