ఘోర ప్ర‌మాదం.. ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఐదుగురు మృత్యువాత‌

Lorry hit Auto in Vikarabad Five people dead.వికారాబాద్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.ఆటోను లారీ ఢీ కొట్టింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Nov 2022 11:51 AM IST
ఘోర ప్ర‌మాదం.. ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఐదుగురు మృత్యువాత‌

వికారాబాద్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మృత్యువాత ప‌డ్డారు. మ‌రికొంద‌రు గాయ‌ప‌డ్డారు.

గురువారం ఉద‌యం ధ‌రూర్ మండ‌లం కేరెల్లి శివారులోని బాచారం బ్రిడ్జి వ‌ద్ద ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను వికారాబాద్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఒక‌రు మ‌ర‌ణించారు. మిగిలిన వారి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో మెరుగైన వైద్య చికిత్స కోసం హైద‌రాబాద్ త‌ర‌లిస్తుండ‌గా ఇంకొక‌రు చ‌నిపోయిన‌ట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ప్ర‌మాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.

మృతుల‌ను ఆటో డ్రైవర్‌ జమీల్‌, రవి, కిషన్‌, సోనీబాయి, హేమ్లాలుగా గుర్తించారు. బాధితులంతా పెద్దేముల్ మండ‌లం మ‌ద‌నంతాపూర్ తండా, రేగొండిల‌కు చెందిన వాసులు. వీరంతా కూలీ ప‌నుల కోసం వికారాబాద్‌కు వెలుతుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story