హైదరాబాద్: ఎల్బీ నగర్ పొక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పొక్సో కేసులో న్యాయవాద విద్యార్థితో పాటు న్యాయవాదిగా పని చేస్తున్న అతని తండ్రికి జైలు శిక్షతో పాటు, భారీ జరిమానా విధించింది. అలాగే ఈ కేసులో బాధితురాలికి 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న మేడిపల్లి భరత్ కుమార్ రెడ్డి (29) న్యాయవాద విద్యార్థి ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో పోలీసులు అతనిపై పొక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ ఘటన 2016వ సంవత్సరంలో జరిగింది.
కాగా ఈ కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడన్న నేర ఆరోపణలపై న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న అతని తండ్రి సుధాకర్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన ఎల్బీనగర్ పోక్సో కోర్టు భరత్ కుమార్ రెడ్డికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.2 లక్షల 69 వేల జరిమానా విధించింది. అలాగే సుధాకర్ రెడ్డికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధించింది. నిందితులకు శిక్ష పడటంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగంలో ఏసీపీగా ఉన్న వేణుగోపాల్ రావు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మంజులా దేవి, సునీత కీలక పాత్ర వహించారు. వీరితోపాటు ఏఎస్సై బాలయ్య, కానిస్టేబుళ్లు లింగమయ్య, సాయి ప్రసాద్ కూడా ప్రధాన పాత్ర పోషించారు.