పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. హైకోర్టు న్యాయవాది దంపతులపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. మంథని నుంచి హైదరాబాద్‌కు హైకోర్టు న్యాయవాది దంపతులు గట్టు వామన్‌రావు, ఆయన భార్య నాగమణి కారులో వెలుతుండగా.. రామగిరి మండలం కల్వచర్ల పెట్రోలు బంకు వద్ద దుండగులు వారి కారును అడ్డగించారు. అనంతరం కారులో ఉన్న వామన్‌రావు, ఆమె సతీమణి నాగమణిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. మంథని కోర్టులో ఓ కేసుకు హజరైన గట్టు వామన్ రావు, నాగమణి దంపతులు తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
గమనించిన స్థానికులు.. తీవ్రగాయాలతో పడి ఉన్న న్యాయవాది దంపతులను 108 వాహానంలో పెద్దపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలో చేతి గ్లౌజ్‌లు లభ్యం అయ్యాయని తెలిపారు. పక్కా ప్రణాళికతోనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న పలు అక్రమాలపై హైకోర్డులో ఫిల్స్ వేశారు గట్టు వామన్‌రావు నాగమణి. ఈ క్రమంలోనే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.