నెల రోజుల క్రితమే ప్రేమ వివాహం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
Lady constable commits suicide in Karnataka.ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే యువత ఆత్మహత్యలకు
By తోట వంశీ కుమార్ Published on 29 July 2021 8:47 AM IST
ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దంపతుల మధ్య గొడవలు సహజం. అలకలు, బుజ్జగింపులు సర్వసాధారణం. వారిద్దరికి నెలరోజుల క్రితమే వివాహం అయ్యింది. వారిద్దరూ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వంట విషయంలో జరిగిన గొడవ కాస్త పెద్దదిగా మారింది. క్షణికావేశంలో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మకూరు జిల్లా మధుగిరి తాలూకా తవినికెరె గ్రామానికి చెందిన నేత్రావతి(27) కామాక్షిపాళ్య ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌లో పని చేస్తోంది. పీణ్యాలో కానిస్టేబుల్ అయిన మంజునాథ్ తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో పెద్దలను ఒప్పించి.. అధికారుల సమక్షంలో నెలరోజుల క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. చిక్కగొల్లరహట్టి అనే ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం మొదలెట్టారు. ప్రేమించి పెళ్లిచేసుకోవడంతో కొత్త జంట ఎంతో అన్యోన్యంగా ఉంటోంది. అయితే.. ఇటీవల వంట చేసే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
ఆ గొడవ కాస్త పెద్దదిగా మారింది. ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. ఈ క్రమంలో తన భర్త తనను ప్రేమగా చూసుకోవడం లేదని తీవ్ర మనస్థాపం చెందిన నేత్రావతి.. గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమెది నిజంగా ఆత్మహత్యేనా లేక భర్త హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.