మహిళా ఏఆర్ కానిస్టేబుల్ కేసులో ట్విస్టు.. అవన్నీ తప్పుడు అభియోగాలేనట..
Lady AR Constable Case. ఏఆర్ కానిస్టేబుల్ సంధ్యారాణిపై ఆమె భర్త చరణ్ తేజ చేసిన వ్యాఖ్యలలో నిజం లేదని పోలీసులు చెబుతున్నారు.
By Medi Samrat
ఏఆర్ కానిస్టేబుల్ సంధ్యారాణిపై ఆమె భర్త చరణ్ తేజ చేసిన వ్యాఖ్యలలో నిజం లేదని పోలీసులు చెబుతున్నారు. అతడు కావాలనే సంధ్యా రాణిపై తప్పుడు ప్రచారం చేసినట్లు పోలీసులు అతడిపైనే కేసు పెట్టడం కొత్త మలుపు తీసుకుంది. సంధ్యారాణిపై భర్త చరణ్‌తేజ దుష్ప్రచారం చేసినట్లు విచారణలో వెల్లడైంది. పెళ్లి చేసుకొని మోసం చేసినట్లు భర్త చరణ్ తేజపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కులం పేరుతో దూషించి, వేధించినట్లు సంధ్యారాణి ఫిర్యాదులో పేర్కొంది. ఐపీసీ 498A, 506, వరకట్న నిరోధక చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చరణ్ తేజను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కి తరలించారు.
మొత్తం ముగ్గురిని పెళ్లి చేసుకుందని ఇద్దరు విడాకులు ఇవ్వగా.. ఒకరు ఈమె వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని సంధ్యారాణిపై ఆరోపణలు చేశాడు చరణ్ తేజ. కొత్తగా హైదరాబాద్ కు వచ్చిన వాళ్లతో కూడా ఆమె పరిచయాలు పెంచుకునేదని.. ఆ తర్వాత ప్రేమిస్తున్నానంటూ నమ్మించి డబ్బులు దోచుకోవడమే పనిగా పెట్టుకుందని.. ఎవరికైనా ఆమె తీరు మీద అనుమానం వచ్చి అడిగితే పోలీసు డిపార్ట్మెంట్ పేరు చెప్పి బెదిరించడం మొదలు పెట్టేదని షాబాద్ మండలం హైతబాద్ కు చెందిన చరణ్ తేజ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత వివాహాలు విషయం చెప్పకుండా పెళ్లి చేసుకుందని చరణ్ ఆరోపించాడు. ఆమె అసలు విషయం తెలిసి దూరం పెట్టడానికి ప్రయత్నించగా పోలీసు కేసు పెడతాను అంటూ బెదిరించడం మొదలు పెట్టిందని చరణ్ తేజ వాపోయాడు. పెళ్లి చేసుకోక పోతే ST SC అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించిందని.. అంతేకాకుండా కలిసి తిరిగిన ఫోటోలు వీడియోస్ బయటపెడ్తానాన్ని బెదిరింపులకు గురి చేసిందని చరణ్ శంషాబాద్ డిసిపి, షాబాద్ పోలీస్ స్టేషన్ లను ఆశ్రయించాడు. అయితే అతడు చేసిన అభియోగాలలో ఎటువంటి నిజం లేదని పోలీసులు చరణ్ తేజను అరెస్ట్ చేశారు.