Asifabad: హత్య కేసు.. 16 మందికి జీవిత ఖైదు
2020లో 45 ఏళ్ల వ్యక్తిని హత్య చేసిన కేసులో 16 మందికి జీవిత ఖైదు విధిస్తూ కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.
By అంజి Published on 17 Oct 2024 9:59 AM IST
Asifabad: హత్య కేసు.. 16 మందికి జీవిత ఖైదు
హైదరాబాద్: 2020లో 45 ఏళ్ల వ్యక్తిని హత్య చేసిన కేసులో 16 మందికి జీవిత ఖైదు విధిస్తూ కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎంవీ రమేష్.. వారిని ఐపీసీ సెక్షన్ 302 (హత్య), ఇతర సంబంధిత సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించారు. వారికి జీవితాంతం కఠిన కారాగార శిక్షను కోర్టు విధించిందని పోలీసులు తెలిపారు. కోర్టు మొత్తం రూ.1.49 లక్షల జరిమానా కూడా విధించింది.
16 మందిని జర్పుల సురేష్, జర్పుల సత్యవతి, అజ్మీరా వసంతరావు, జర్పుల తిక్యా నాయక్, జర్పుల హరీష్, అజ్మీరా అరవింద్, అజ్మీరా నవీన్, అజ్మీరా ప్రవీణ్, అజ్మీర సంతోష్, అజ్మీరా ప్రవీణ్ కుమార్, జర్పుల లక్ష్మి, జర్పుల రజిత, జర్పుల తుకారాం, జర్పుల రవి, జర్పుల రాజు, జర్పుల బిక్యా నాయక్. అందరూ రెబ్బెన మండలం సింగిల్‌గూడ గ్రామానికి చెందినవారు
ప్రాసిక్యూషన్ ప్రకారం.. ఈ కేసులో నిందితుడైన నంబర్ వన్ (ఏ1).. జిల్లాలోని రెబ్బెన మండలం సింగిల్‌గూడ గ్రామానికి చెందిన వ్యక్తి కుమార్తెను ప్రేమిస్తున్నాడు. అయితే బాలిక తండ్రి దానిని వ్యతిరేకించాడు.
దీంతో నిందితుడు బాలిక తండ్రిని అంతమొందించేందుకు పథకం పన్నాడు. ఆగష్టు 19, 2020 రాత్రి నిందితుడు ఇతరులతో కలిసి ఆ వ్యక్తి ఇంటికి పక్కనే ఉన్న బంధువు ఇంట్లో గుమిగూడారు. ఆ తర్వాత ఇంటి నుండి బయటకు వచ్చిన వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసి అతని కుటుంబ సభ్యులు ఇంటి నుండి బయటకు రాగానే నిందితులు వారిపై రాళ్లు రువ్వారు. వ్యక్తి భార్య, ఇతర కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి చేరుకునేలోపే మరణించాడని పోలీసులు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.