బాబాయ్‌తో కలిసి ఓ నాలుగేళ్ల చిన్నారి బయటకు వెళ్లాడు. అయితే.. ప్రమాదంలో బాబాయ్ మృతి చెందాడు. ఈ విషయం తెలియని ఆ చిన్నారిని.. లే బాబాయ్ ఇంటికి వెలుదాం అంటూ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. అలా ఏడుస్తూ.. సొమ్మసిల్లి ఏడుగంటల పాటు మృతదేహాంపై నిద్రపోయాడు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నర్సన్నపేటకి చెందిన ఎక్కలదేవి ఐలయ్య (28) శనివారం రాత్రి తన అన్నకొడుకు మోక్షిత్ (4)ను బైక్‌పై ఎక్కించుకొని జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ కి బయలుదేరాడు.
రామ్‌నగర్ సమీపంలో రోడ్డు పై ధాన్యం కుప్పలు రాశులుగా పోసి కవర్లు కప్పారు. అయితే.. చీకట్లో ధాన్యం రాశుల కుప్పలు కనిపించకపోవడంతో ఓ కుప్పను ఢీ కొట్టాడు. దీంతో ఇద్దరు ఒక్కసారిగా ఎగిరి రోడ్డు మీద పడిపోయారు. ఐలయ్యకు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే.. చిన్నారి మోక్షిత్ మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డాడు. రాత్రి సమయం కావడంతో ఎవరూ వారిని చూడలేదు. మోక్షిత్.. తన బాబాయ్ చనిపోయాడని తెలియక.. అతడి మృతదేహాం వద్దకు వెళ్లి బాబాయ్‌ను లేపేందుకు యత్నించాడు.
ఎంతసేపు పిలిచినా.. బాబాయ్ కదలపోవడంతో ఆ చిన్నారి ఏడుస్తూనే మృతదేహాం పై తల పెట్టుకుని పడుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున అటుగా వెలుతున్న ఓ రైతు దీనిని గమనించి విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. అందరి వచ్చి చూసే సరికి బాలుడు శవంపై తలపెట్టి పడుకుని ఉన్నాడు. వారు ఆ బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రాత్రంతా ఆ చిన్నారి శవంతో గడపడం స్థానికులను కంటతడి పెట్టించింది.