ఖతార్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా విజయం సాధించింది. పలు దేశాల్లో అర్జెంటీనా విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. మెస్సీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇక కేరళలో కూడా అభిమానులు రోడ్ల మీదకు వచ్చి వేడుకలు జరిపారు. అయితే కన్నూర్‌లో పోలీసు అధికారులపై కొందరు దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఒక వ్యక్తిని కత్తితో పొడవడంతో గందరగోళంగా మారింది. అనేక మంది ఫుట్‌బాల్ అభిమానులు కూడా గాయపడ్డారు. కొచ్చిలోని కలూర్‌లో, ట్రాఫిక్‌ను అడ్డుకోవాలని కోరిన సివిల్ పోలీసు అధికారిపై అభిమానులు దాడి చేశారు. ఫుట్‌బాల్ అభిమానులు రోడ్డుపై ట్రాఫిక్‌ను అడ్డుకుని అర్జెంటీనా విజయంతో సంబరాలు చేసుకున్నారు. వారిని ప్రశ్నించేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారిపై దాడి చేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు.
కన్నూర్‌లో అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ని వీక్షించి ఇంటికి తిరిగి వస్తున్న అనురాగ్ (24)ని ఐదుగురు వ్యక్తులు కత్తితో పొడిచారు. పల్లియమూల నేతాజీ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ సమీపంలో మ్యాచ్ చూసేసిన తర్వాత ఈ ఘర్షణ చెలరేగిందని, అది కత్తిపోట్లకు దారితీసిందని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన అనురాగ్ ప్రస్తుతం కన్నూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన అతని స్నేహితులకు కూడా గాయాలయ్యాయి. పలువురిపై భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తిరువనంతపురంలో మద్యం మత్తులో ఉన్న గుంపును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పోలీసు అధికారులను కొట్టారు. వారి దాడిలో పొజియూర్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ గాయపడ్డారు.