దారుణం.. ప్రియురాలిని ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపాడు
బెంగళూరులో ప్రెషర్ కుక్కర్‌తో తన లైవ్-ఇన్ పార్టనర్‌ను కొట్టి చంపాడో వ్యక్తి. శనివారం నాడు ఈ ఘటనకు జరిగింది.
By అంజి
Kerala man bludgeons live-in partner to death with pressure cooker in Bengaluru
బెంగళూరులో ప్రెషర్ కుక్కర్‌తో తన లైవ్-ఇన్ పార్టనర్‌ను కొట్టి చంపాడో వ్యక్తి. శనివారం నాడు ఈ ఘటనకు జరిగింది. కాగా కేరళకు చెందిన 24 ఏళ్ల నిందిత వ్యక్తిని ఆగస్టు 27, ఆదివారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక రాజధానిలోని ఒక ప్రైవేట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తున్న ఈ జంట గత రెండేళ్లుగా బెంగళూరులోని అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. కొల్లం జిల్లాకు చెందిన వైష్ణవ్‌గా గుర్తించిన నిందితుడు 24 ఏళ్ల పద్మాదేవిని హత్య చేసిన వెంటనే పరారీలో ఉన్నట్లు తెలిసింది. అయితే 24 గంటల్లోనే బెంగళూరు పోలీసులు అతడిని పట్టుకున్నారు. తిరువనంతపురంలోని అట్టింగల్‌కు చెందిన పద్మాదేవికి వేరే వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో వైష్ణవ్ ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
నగరంలోని న్యూ మైకో లేఅవుట్‌లో శనివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పద్మాదేవికి వచ్చిన ఫోన్ కాల్‌పై ఆవేశంతో వైష్ణవ్ గొడవపడ్డాడు. ఇదే విషయమై శనివారం వారిద్దరి మధ్య గొడవ జరగడం హత్యకు దారితీసింది. వైష్ణవ్ ప్రెషర్ కుక్కర్‌తో ఆమె తలను పగులగొట్టాడని, దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె పెద్ద మొత్తంలో రక్తాన్ని పోగొట్టుకుందని నివేదికలు చెబుతున్నాయి. పద్మాదేవి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆగ్నేయ) సికె బాబా తెలిపారు.