ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. దేశంలోని ఎక్కడో ఒక చోట వాళ్లు వేధింపులు, అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. బైక్‌పై వెళుతున్న సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ యువతిపై గుర్తుతెలియని దుండగుడు వేధించిన ఘటన బెంగళూరులో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయనగర పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 6వ తేదీన రాత్రి 10.30 గంటల సమయంలో బాధితురాలు 26 ఏళ్ల టెక్కీ తన నివాసానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సౌతేండ్ సర్కిల్ సమీపంలోకి రాగానే బైక్‌పై వచ్చిన నిందితులు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతను ఆమె బట్టలు లాగి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు.
టెక్కీ గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న జయనగర్ పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి దుండగుడి కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. యూపీలోని ఆగ్రాలోనూ ఓ దారుణం వెలుగు చూసింది. ఒక హోటల్‌లో పని చేసే మహిళా ఉద్యోగిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బలవంతంగా మద్యం తాగించి మరీ ఆమెపై దారుణానికి ఎగబడ్డారు. ఈ కేసులో పోలీసులు ఒక మహిళతో పాటు నలుగురు పురుషుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.