దారుణం.. జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. కొడుకును చంపేందుకు తండ్రి ప్లాన్
Karnataka man throws out wife, 3-yr-old son on astrologer’s advice.
By అంజి
మూడేళ్ల కొడుకుతో కుటుంబానికి దురదృష్టకర, విషాదకర పరిస్థితులు వస్తాయని చెప్పడంతో ఓ వ్యక్తి దారుణానికి తెగించాడు. జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. తన భార్య, మూడేళ్ల కొడుకును ఇంట్లో నుంచి బయటకు నెట్టివేశాడు. సదరు వ్యక్తిపై కర్ణాటక పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బెంగళూరు సమీపంలోని చన్నపట్న నగరంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నవీన్, శ్రుతి వివాహమై మూడేళ్లయింది. 2020లో ఈ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. ఆ అబ్బాయికి రుత్విక్ అని పేరు పెట్టారు.
మంజునాథ లేఅవుట్ వీరూ నివాసం ఉంటున్నారు. జనవరి 22, 2020 మధ్యాహ్నం 12.42 గంటలకు ఈ బిడ్డ జన్మించాడు. మూలా నక్షత్రంలో పుట్టాడని, ఇది కుటుంబానికి దురదృష్టాన్ని, విషాదాన్ని తెస్తుందని జ్యోతిష్యుడు చెప్పాడు. జ్యోతిష్యుడిని కలిసిన తర్వాత.. నవీన్ తన భార్య, కొడుకును వేధించడం ప్రారంభించాడు. నిత్యం నవీన్ తన కొడుకు మూలా నక్షత్రంలో పుట్టాడని తిట్టి, భార్యపై దాడి చేసేవాడు. ఈ క్రమంలోనే నవీన్ భార్య శృతి రాంనగర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
తన కొడుకును పెట్రోల్ పోసి కాల్చి చంపాలని నవీన్, అతని కుటుంబ సభ్యులు తనను కోరారని శృతి పోలీసులకు చెప్పింది. ఈ నీచమైన కొడుకు తనకు వద్దంటూ ఇంట్లోకెళ్లి ఈడ్చి బయటపడేశాడని చెప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.