బలవంతపు అవినీతి.. పైఅధికారుల ఒత్తిడి.. ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

తన సీనియర్ అధికారులు రూ. 187 కోట్ల నిధుల దుర్వినియోగానికి బలవంతం చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

By అంజి  Published on  28 May 2024 12:12 PM GMT
Karnataka, government employee, suicide, forced corruption

బలవంతపు అవినీతి.. పైఅధికారుల ఒత్తిడి.. ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య 

కర్నాటకలోని షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్‌లో 50 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సీనియర్ అధికారులు రూ. 187 కోట్ల నిధుల దుర్వినియోగానికి బలవంతం చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోందని మంగళవారం నాడు పోలీసులు తెలిపారు. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కెఎమ్‌విఎస్‌టిడిసి) సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ పి, ఆదివారం సాయంత్రం శివమొగ్గలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆరు పేజీల సూసైడ్ నోట్ రాశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు రూ.187 కోట్ల దుర్వినియోగానికి సంబంధించి ఒత్తిడి కారణంగా చంద్రశేఖరన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షెడ్యూల్డ్ తెగల కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, అకౌంటెంట్ అయిన జెజి పద్మనాభ, పరశురామ్ అనే ఇద్దరు డిపార్ట్‌మెంట్ అధికారుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. అతను తన ఆత్మహత్య లేఖలో బెంగళూరులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ చీఫ్ మేనేజర్ శుచిత పేరును కూడా పేర్కొన్నారు.

చంద్రశేఖరన్ పి.. "వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిధుల దుర్వినియోగం" కోసం తన సహోద్యోగులు తనను 'వేధించారని' సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఖాతా నుండి లెక్కల్లో చూపని డబ్బును మళ్లించడానికి సమాంతర బ్యాంకు ఖాతాను తెరవమని చంద్రశేఖరన్ తన సీనియర్ అధికారులను బలవంతం చేశారని ఆరోపించారు.

యూనియన్ బ్యాంక్‌లో "స్వీప్-ఇన్, స్వీప్-అవుట్" ఖాతా తెరవమని ఒక మంత్రి, అధికారి తనను ఆదేశించారని సూసైడ్ నోట్ పేర్కొంది, ఇది ఖాతాదారులకు సేవింగ్స్, కరెంట్ ఖాతాల మధ్య నిధులను బదిలీ చేయడానికి అనుమతిస్తుంది అని పోలీసు అధికారి జోడించారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిజెపి లక్ష్యంగా చేసుకోవడంతో ఈ ఆత్మహత్య రాష్ట్రంలో పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది.

“చంద్రశేఖర్ ఆత్మహత్యతో చనిపోయాడు. తన మరణానికి ముందు, అతను ఒక నోట్‌లో నిజాన్ని వెల్లడించాడు. నోట్‌లో ముగ్గురు ప్రభుత్వ అధికారుల పేర్లతో పాటు 'మంత్రి' అనే పదాన్ని ప్రస్తావించారు. మంత్రి ఆదేశాల మేరకే అన్నీ చేశామని చెప్పారు. మంత్రి మౌనిక ఆదేశాల మేరకే 187 కోట్లు బదిలీ చేశారని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అసలు విషయం బయటపెట్టడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అవినీతి బయటపడింది' అని శివమొగ్గ బీజేపీ ఎమ్మెల్యే చన్నబసప్ప అన్నారు.

వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో 187 కోట్ల రూపాయల భారీ అవినీతికి పాల్పడ్డారని, ఈ హంతక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అధికారిని వేధించిందని, అతను డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని బిజెపి నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక ఆరోపించారు. "ముఖ్యమంత్రి సిద్ధరామయ్యగారూ.. ఇది ఆత్మహత్య కాదు, హత్య. దీనికి బాధ్యులెవరు? మీ ప్రభుత్వ కమీషన్ దాహానికి ఇంకా ఎంతమంది ప్రాణాలు బలికావాలి?" అతను అడిగాడు. దళితులు, గిరిజన వర్గాల కోసం పనిచేస్తున్నారనే ముసుగులో కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర ఆరోపించారు.

షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మంత్రి బి.నాగేంద్రను తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, అధికారి మృతిపై పారదర్శక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాను అని కన్నడలో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు (ఐపిసి సెక్షన్ 306) ముగ్గురు ప్రభుత్వ అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story