ఘోర ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 10:23 AM ISTఘోర ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. కారుని రెండు లారీ ఢీకొట్టాయి. దాంతో.. కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘోర ప్రమాదం కర్ణాటకలోని చిత్రదుర్గ-షోలాపూర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
రోడ్డుప్రమాదంలో చనిపోయిన మృతులను పోలీసులు గుర్తించారు. హోసపేట దగ్గరలోని ఉక్కడకేరికి చెందిన గోనిబసప్ప (65), కెంచమ్మ (80), భాగ్యమ్మ (30), యువరాజ్ (5), సండూర్‌కు చెందిన భీమలింగప్ప (50), అతని భార్య ఉమ (45), వారి కుమారుడు అనిల్ (30)గా పోలీసులు గుర్తించారు. కాగా.. కారులో హరపనహళ్లి తాలూకాలోని కులహళ్లిలోని గోనె బసవేశ్వర ఆలయాన్ని సందర్శించి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దేవుడి వద్దకు వెళ్లి తిరిగి వస్తూ అనంతలోకాలకు వెళ్లిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో విషాదచాయలు అలుముకున్నాయి.
అయితే.. వ్యాసనకెరె రైల్వే స్టేషన్ దగ్గర కుడ్లిగి నుంచి వెళ్తున్న టిప్పర్ చిత్రదుర్గ-షోలాపూర్ రహదారిపై వేగంగా వెళ్తుంది. అయితే.. ఉన్నట్లుండి టిప్పర్ అదుపుతప్పింది. దాంతో.. డివైడర్‌ను దాటి అవతలి రోడ్డులోకి వెళ్లిపోయింది. అప్పుడే అటుగా వస్తున్న కారుని ఢీకొట్టింది. అంతలోనే వెనుక నుంచి తమిళనాడుకు చెందిన మరో లారీ వచ్చి కారుని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ రోడ్డుప్రమాదంలో రెండు లారీలు ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో రెండేళ్ల బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇక గాయపడ్డ రెండు లారీల డ్రైవర్లు పళనిస్వామి, రాజేష్‌లతో పాటు బాలుడిని కొప్పల్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు తెలస్తోంది. అయితే.. ఈ దుర్ఘటనలో కారులో చనిపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రమాద స్థలిలో పరిస్థితులు భయానకంగా కనిపించాయి. అంతేకాక.. ఈ రహదారి నిత్యం రద్దీగా ఉండేది కావడంతో.. రోడ్డుప్రమాదం కారణంగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. కాగా.. టిప్పర్ డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. దర్యాప్తు చేస్తున్నామి పోలీసులు వెల్లడించారు.