చిత్ర పరిశ్రమలో విషాదం.. దర్శకుడు కన్నుమూత

ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు గురు ప్రసాద్ ఆదివారం ఉదయం బెంగళూరులోని తన అపార్ట్‌మెంట్‌లో చనిపోయి కనిపించారు.

By Kalasani Durgapraveen  Published on  3 Nov 2024 3:32 PM IST
చిత్ర పరిశ్రమలో విషాదం.. దర్శకుడు కన్నుమూత

ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు గురు ప్రసాద్ ఆదివారం ఉదయం బెంగళూరులోని తన అపార్ట్‌మెంట్‌లో చనిపోయి కనిపించారు. ఆయన వయసు 52 ఏళ్లు. రెండు లేదా మూడు రోజుల క్రితం అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తర బెంగళూరులోని మదనాయకనహళ్లి ప్రాంతంలో గత ఎనిమిది నెలలుగా నివసిస్తున్న ఆయన ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు.

గురు ప్రసాద్ ఇటీవల ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నాడని, ఆ తర్వాత అతన్ని డిప్రెషన్‌లోకి నెట్టినట్లు తెలుస్తోంది. మఠ (2006), ఎడ్డెలు మంజునాథ (2009) చిత్రాలకు ప్రసిద్ధి చెందిన గురు ప్రసాద్, కన్నడ రియాల్టీ షోలలో న్యాయనిర్ణేతగా కూడా కనిపించారు. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోవడంతో ఇటీవల మళ్లీ పెళ్లి చేసుకున్నారు. డెడ్ బాడీని పరిశీలించిన పోలీసులు గురు ప్రసాద్ రెండు, మూడు రోజుల క్రితమే ఉరి వేసుకున్నట్లు భావిస్తున్నారు. గురు ప్రసాద్ ఆత్మహత్యకు కారణమేంటనేది ఇంకా తెలియరాలేదని వివరించారు.

బాడీగార్డ్, కుష్క, విజిల్, హుడుగురు, మైలారీ, జిగర్తాండ సినిమాల్లో గురు ప్రసాద్ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక హుడుగారు, విజిల్, సూపర్ రంగా చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా కూడా గురు ప్రసాద్ పనిచేశారు. గురుప్రసాద్ తాజా చిత్రం రంగనాయక, 2024లో విడుదలైంది. దురదృష్టవశాత్తూ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రదర్శన చూపకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. గురు ప్రసాద్ మరణంపై కన్నడ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Next Story