హింసించి వెళ్ళిపోయిన స్టార్ హీరో.. చనిపోయాడని వాట్సాప్ మెసేజ్
33 ఏళ్ల రేణుకస్వామి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప, అతని భార్య పవిత్ర గౌడలు అరెస్టయ్యారు.
By అంజి Published on 13 Jun 2024 6:00 AM GMTహింసించి వెళ్ళిపోయిన స్టార్ హీరో.. చనిపోయాడని వాట్సాప్ మెసేజ్
33 ఏళ్ల రేణుకస్వామి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప, అతని భార్య పవిత్ర గౌడలు అరెస్టయ్యారు. దర్శన్ ఈ హత్యలో ఎలా భాగమయ్యాడు.. ఈ హత్యను దర్శన్ ఫ్యాన్ క్లబ్ మెంబర్ ద్వారా అమలు చేయడానికి ఎలాంటి ప్రణాళికలను రచించాడనే విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. పవిత్ర గౌడకు అనుచిత సందేశాలు పంపేందుకు రేణుకాస్వామి నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను క్రియేట్ చేశాడని.. కావాలనే పవిత్ర గౌడను టార్గెట్ చేయడం హీరో దర్శన్ కు అసలు నచ్చలేదని తెలుస్తోంది. పవిత్రకు రేణుకాస్వామి పంపిన అసభ్యకరమైన సందేశాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిత్రదుర్గలోని అపోలో ఫార్మసీలో పనిచేస్తున్న రేణుకాస్వామి బెంగళూరులోని సుమనహళ్లి వంతెన వద్ద శవమై కనిపించారు.
రాఘవేంద్ర, కార్తీక్, కేశవమూర్తి అనే ముగ్గురు వ్యక్తులు రేణుకస్వామిని హత్య చేసి మృతదేహాన్ని పారేశామని పోలీసుల ఎదుట అంగీకరించడంతో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. విచారణలో, నిందితులు దర్శన్ పేరును ప్రస్తావించకూడదని మొదట అనుకున్నారు. హత్యను ఒప్పుకోడానికి రూ.5 లక్షలు ఆఫర్ చేశారని, వారి న్యాయపరమైన ఖర్చులు భరిస్తానని దర్శన్ హామీ ఇచ్చాడని కూడా తెలుస్తోంది. పోలీసు వర్గాల ప్రకారం, రేణుకాస్వామిపై అసభ్యకరమైన వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకోవడానికి పవిత్ర దర్శన్‌ను ప్రేరేపించింది. రేణుకాస్వామికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు చిత్రదుర్గలోని తన అభిమాన సంఘం కన్వీనర్ రాఘవేంద్ర సహాయం దర్శన్ తీసుకున్నారు.
రేణుకాస్వామి భార్య సహాన మాట్లాడుతూ.. ఘటన జరిగిన రోజు రాత్రి రాఘవేంద్ర తన భర్తను ఇంటి దగ్గర నుంచి అపహరించి కామాక్షిపాళ్యంలోని ఓ షెడ్డుకు తీసుకెళ్లాడని తెలిపారు. హత్య జరిగిన జూన్ 8 సాయంత్రం దర్శన్ షెడ్‌ను సందర్శించారు. దర్శన్ సంఘటనా స్థలానికి చేరుకునేలోపే రేణుకాస్వామిపై కిరాయి వ్యక్తులు దాడి చేశారు. అనంతరం దర్శన్ రేణుకాస్వామిపై బెల్టుతో కొట్టాడు.
దర్శన్ వెళ్లిన తర్వాత రేణుకాస్వామిని దుండగులు మళ్లీ కొట్టారు. నిందితుల్లో ఒకరైన ప్రదోష్.. రేణుకాస్వామి మృతి గురించి దర్శన్‌కు చెప్పారు. ఇక ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రూ.30 లక్షల డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. డబ్బు అందుకున్న తర్వాతే కార్తీక్ అతని బృందం మృతదేహాన్ని పారవేసేందుకు, పోలీసుల ముందు లొంగిపోవడానికి అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విచారణ తర్వాత మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో ప్రదోష్ మొదట వారికి రూ.5 లక్షలు ఇచ్చాడు. మిగిలిన రూ. 25 లక్షలను ప్రదోష్ దాచిన ప్రదేశాన్ని పోలీసులు గుర్తించారు.
తొలుత ఇద్దరు నిందితులు కామాక్షిపాళ్య పోలీసులను ఆశ్రయించగా ఆర్థిక వివాదంతోనే రేణుకాస్వామిని హత్య చేసినట్లు అంగీకరించారు. దర్యాప్తులో దర్శన్, పవిత్ర ప్రమేయం వెలుగులోకి వచ్చింది, ఆ తర్వాత మరో 11 మందిని అరెస్టు చేయడానికి దారితీసింది. విచారణలో, రాత్రంతా, వాట్సాప్ ద్వారా ఏమి జరుగుతుందో దర్శన్‌కు తెలుస్తూ వచ్చిందని పోలీసులు వర్గాలు తెలిపాయి. నిందితుల కాల్ డిటైల్స్ రికార్డులను సేకరించిన పోలీసులు వారి మొబైల్ ఫోన్లను పరిశీలించారు. జూన్ 8వ తేదీ రాత్రంతా నిందితుడు దర్శన్‌తో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.