తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న నలుగురు మైనర్లకు మంగళవారం జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. సైదాబాద్‌లోని జువైనల్ హోమ్ నుంచి ముగ్గురు బాలురు బెయిల్‌పై విడుదల కాగా.. మరో బాలుడికి బెయిల్ మంజూరైనా కొన్నికారణాల వల్ల ఆలస్యమైంది.
జువైనల్ బోర్డు మైనర్ బాలురు బెయిల్ పిటిషన్లను రెండుసార్లు తిరస్కరించింది అయితే.. ఈసారి మాత్రం షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ. 5 వేల పూచీకత్తుతో పాటు పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలనే షరతును విధించింది. నిందితుల్లో మేజర్ అయిన సాదుద్దీన్ మాలిక్ కు కోర్టు బెయిల్ నిరాకరించడంతో అతను చంచల్ గూడ జైల్లోనే ఉన్నాడు.
మే 28, 2022 జూబ్లీహిల్స్ రోడ్ నంర్ 36లోని అమ్నీషియా పబ్ కు వచ్చిన బాలిక(17)ను ఇంటి వద్ద దించుతామని కొందరు మైనర్లు నమ్మించి కారులో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. సాధుద్దీన్ మాలిక్(19) ను చంచల్‌గూడ జైలుకు తరలించగా మిగిలిన ఐదుగురు బాలురను జువైనల్ హోంకి తరలించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ కేసును పోలీసులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కీలక ఆధారాలను ఇప్పటికే సేకరించారు. దాదాపు 400 పేజీల ఛార్జ్ షీట్ ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.