ఓ యువకుడితో ప్రేమలో పడి తమకు చెప్పకుండా పెళ్లి చేసుకుని తలవంపులు తెచ్చిందని బావించిన తల్లిదండ్రులు.. తమ కుమారై ముఖానికి నలుపు రంగు పూసి గుండు గీయించారు. ఈ అవమానవీయ ఘటన జార్ఖండ్‌లోని పాలము జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పాలము జిల్లాలోని సెమ్రా పంచాయతీకి చెందిన ఓ యువతి పనేరిబంద్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. అనంతరం ఇద్దరూ పెద్దలకు చెప్పకుండా.. నెల రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. తమ కుమారై కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆ యువతి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
ఈ క్రమంలో ఆదివారం ఆ యువతి జాడను కనిపెట్టారు. వెంటనే అక్కడకు వెళ్లి తమ కుమారైను సొంత గ్రామానికి తీసుకువచ్చారు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. గ్రామ పెద్దలు ఆ యువతి చేసిన పనిని తప్పుగా నిర్ణయించి శిక్ష విధించారు. ఆ యువతి ముఖానికి నలుపు రంగు పూసి, బలవంతంగా గుండు గీయించారు. ఈ తతంగం మొత్తాన్ని అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది వైరల్‌గా మారింది. విషయం పోలీసులకు తెలియడంతో 12 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో ఆ యువతి భర్త కూడా ఉన్నాడు.