పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్.. ఐదుగురు దుర్మరణం

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.

By Srikanth Gundamalla  Published on  18 Nov 2023 12:22 PM IST
jharkhand, road accident, five dead,

పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్.. ఐదుగురు దుర్మరణం

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

జార్ఖండ్‌లోని థోరియా గ్రామానికి చెందిన కొందరు టికోడిహ్‌లో జరిగిన వివాహ కార్యక్రమానికి శుక్రవారం హాజరయ్యారు. వివాహ వేడుక ముగిసిన తర్వాత తాము తీసుకెళ్లిన ఎస్‌యూవీ కారులోనే తిరుగుపయనం అయ్యారు. అయితే.. శనివారం తెల్లవారుజామున కారు గిరిధి జిల్లాలోని బాగ్మారాలో గల ముఫాసిల్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలోకి వచ్చాక అదుపుతప్పింది. అప్పటికే కారు అత్యంత వేగంగా వస్తుండటం వల్ల డ్రైవర్‌ దాన్ని నియంత్రించలేకపోయాడు. రోడ్డుపక్కనే ఉన్న చెట్టును కారు బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో పది మంది ఉన్నారని పోలీసులు వెల్లడించారు. రోడ్డుప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. శనివారం తెల్లవారు జామున 3 గంటలు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇద్దరు చిన్నారులు సహా మిగతావారికి తీవ్రగాయాలు అయ్యాయని చెప్పారు. అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్ధం వచ్చింది. దాంతో చుట్టుపక్కల వారు బయటకు వచ్చి చూడగా ప్రమాదం జరిగిందని గుర్తించారని చెప్పారు. ఇక స్థానికుల సమాచారం మేరకు తాము సంఘటనాస్థలానికి చేరుకున్నామన్నారు పోలీసులు. అప్పటికే ఐదుగురు చనిపోయారని చెప్పారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామని.. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఈ రోడ్డుప్రమాద సంఘటనపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Next Story