జార్ఖండ్‌లోని జామ్‌తడా జిల్లా బరాకర్ నది నుండి రెస్క్యూ బృందాలు సోమవారం మరో ఆరు మృతదేహాలను వెలికితీశాయి. గత గురువారం నాడు సాయంత్రం జామ్తారాలో పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ధృవీకరించబడిన మరణాల సంఖ్య 14 కి చేరుకుంది. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. జమ్తారా డిప్యూటీ కమిషనర్ ఫైజ్ అక్ అహ్మద్ ముంతాజ్ మాట్లాడుతూ.. "శనివారం మొదటి మృతదేహం, ఆదివారం ఏడు, సోమవారం ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాదం జరిగిన రోజు పడవలో ఉన్న ఐదుగురు వ్యక్తులను స్థానికులు సజీవంగా రక్షించారని తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ రెస్య్కూ ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్న మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
బార్బెండియా ఘాట్ నుండి జమ్‌తారా జిల్లాలోని బిర్‌గావ్‌కు ప్రయాణీకులను తీసుకెళ్తుండగా దామోదర్‌కు ఉపనది అయిన బరాకర్ నదిలోని మైథాన్ డ్యామ్ ఎగువన ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పడవ బోల్తా పడింది. బార్బెండియా ఘాట్ నది యొక్క దక్షిణ ఒడ్డున నిర్సా అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది. బిర్గావ్ జమతారా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉత్తర ఒడ్డున ఉంది. మైథాన్ డ్యామ్ బ్యాక్ వాటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నది భారీ విస్తీర్ణంలో ఉండటంతో తప్పిపోయిన వారిని గుర్తించడం కష్టమైంది.