అతి కిరాతకంగా జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీ హత్య
Jammu and Kashmir DGP Prisons found dead in Jammu.జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియా తన ఇంట్లో అతి
By తోట వంశీ కుమార్
జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియా తన ఇంట్లో అతి కిరాతకంగా చంపివేయబడ్డాడు. హేమంత్ కుమార్ లోహియా హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు లష్కరే తోయిబాకు చెందిన భారతీయ శాఖ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్ (పిఎఎఫ్ఎఫ్) ప్రకటించింది.
హేమంత్ కుమార్ లోహియా హత్యకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లోంచి దర్యాప్తు ప్రారంభించారు. జమ్మూలోని తన ఇంట్లో పునరుద్ధరణ పనులు జరుగుతుండడంతో తన స్నేహితుడైన రాజీవ్ ఖజురియా ఇంట్లో హేమంత్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. హేమంత్ హత్య తర్వాత ఆయన ఇంట్లో పనిచేసే సహాయకుడు అదృశ్యమయ్యాడని జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ముకేశ్ సింగ్ తెలిపారు. కనిపించకుండా పోయిన అతడిని యాసిర్‌గా గుర్తించినట్టు తెలిపారు. అతడిది జమ్మూకశ్మీర్‌లోని రాంబాన్ జిల్లా అని పేర్కొన్నారు.
స్థానికేతరులపై దాడులు సహా జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన అన్ని ఉగ్రవాద దాడులకు తమదే బాధ్యత అని PAFF పేర్కొంది. ఇలాంటి మరిన్ని ఉన్నత స్థాయి కార్యకలాపాలు చేపడతామని బెదిరించింది. తాము ఎప్పుడైనా ఎక్కడైనా దాడి చేయగలమని హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్న అమిత్ షాకు ఇది ఒక చిన్న బహుమతి అని PAFF పేర్కొంది. 57 ఏళ్ల లోహియా 1992 ఐపీఎస్ అధికారి. ఆయన గొంతు కోసి హతమార్చారు. అలాగే, ఆయన శరీరంపై కాలిన గాయాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో లోహియా ప్రిజన్స్ డీజీపీగా నియమితులయ్యారు. నిందితుడు తొలుత లోహియాను ఊపిరాడనివ్వకుండా చేసి చంపాడని, ఆపై కిచెన్‌లోని పగిలిన సీసాతో గొంతు కోసినట్టు తెలుస్తోందని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. నిందితుడు లోహియా గొంతు కోసిన అనంతరం మృతదేహాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశాడు.