Honour killing : మా అమ్మాయినే పెళ్లి చేసుకుంటావా.. న‌డిరోడ్డుపై జ‌గ‌న్‌ గొంతుకోసి చంపిన యువ‌తి బంధువులు

త‌మిళ‌నాడులో దారుణం జ‌రిగింది. ప్రేమ వివాహం చేసుకున్నాడ‌ని ఓ యువ‌కుడిని యువ‌తి బంధువులు గొంతు కోసి హ‌త్య చేశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 March 2023 10:16 AM IST
Honour killing,Tamilnadu

మృతుడు జ‌గ‌న్‌

ఇటీవ‌ల కాలంలో ప‌రువు హ‌త్య ఘ‌ట‌న‌లు పెరిగిపోతున్నాయి. అప్ప‌టి వ‌ర‌కు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు లేదా కుమారుడు ప్రేమ వివాహం చేసుకోవ‌డం ఇష్టం లేని త‌ల్లిదండ్రులు దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నారు. స‌మాజంలో త‌మ ప‌రువు పోయింద‌ని బావించి.. క‌న్న ప్రేమ‌ను మ‌రిచి కూతురినో లేదంటే ఆమె చేసుకున్న వాడినో హ‌త‌మారుస్తున్నారు. తాజాగా త‌మిళ‌నాడు రాష్ట్రంలోనూ అలాంటి ఘ‌ట‌న‌నే జ‌రిగింది. కూతురు ప్రేమ వివాహం చేసుకోవ‌డం ఇష్టం లేని ఆమె త‌ల్లిదండ్రులు అల్లుడిని న‌డి రోడ్డుపై అత్యంత దారుణంగా హ‌త‌మార్చారు.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణగిరి జిల్లా కిట్టంబట్టికి చెందిన జగన్ (28) స్థానికంగా టైల్స్ కంపెనీలో ప‌ని చేస్తుండేవాడు. ములంగ‌ళ్‌కు చెందిన శ‌ర‌ణ్య‌(21)ను ప్రేమించాడు. వీరి ప్రేమ వ్య‌వ‌హ‌రం యువ‌తి ఇంట్లో తెలిసింది. వీరి పెళ్లికి అంగీక‌రించ‌లేదు. ఆ యువ‌తిని మ‌రో యువ‌కుడితో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

దీంతో శ‌ర‌ణ్య‌, జ‌గ‌న్‌లు రెండు నెల‌ల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. ఈ విష‌యం తెలిసిన శ‌ర‌ణ్య కుటుంబ స‌భ్యులు ఆగ్ర‌హంతో ఊగిపోయారు. జ‌గ‌న్‌పై క‌క్ష్య పెంచుకున్నారు. కృష్ణగిరి సమీపంలోని కేఆర్‌పీ డ్యామ్ హైవేపై జ‌గ‌న్ వెలుతుండ‌గా శ‌ర‌ణ్య కుటుంబ స‌భ్యులు అత‌డిని అడ్డ‌గించారు. క‌త్తుల‌తో దాడి చేసి గొంతు కోసి హ‌త్య చేశారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని జ‌గ‌న్ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని యువ‌కుడి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story