దారుణం.. అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడిని.. కాల్చి చంపిన నలుగురు దుండగులు

International Kabaddi player shot dead in Punjab's Jalandhar. పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు సందీప్ నంగల్ సోమవారం

By అంజి
Published on : 15 March 2022 7:51 AM IST

దారుణం.. అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడిని.. కాల్చి చంపిన నలుగురు దుండగులు

పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు సందీప్ నంగల్ సోమవారం సాయంత్రం టోర్నమెంట్ సైట్ నుండి బయటకు వస్తుండగా నలుగురు దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. షాకోట్‌లోని మల్లియన్ కలాన్ గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. "ఒక మ్యాచ్ జరుగుతున్న సమయంలో నలుగురు వ్యక్తులు కారులో వచ్చి అతనిని కాల్చిచంపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. మేము దర్యాప్తు చేస్తున్నాము. పోస్ట్ మార్టం తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తాం" అని జలంధర్ పోలీసు ఎస్‌ఎస్‌పి సతీందర్ సింగ్ తెలిపారు. 40 ఏళ్ల వయస్సు గల ఆటగాడు సందీప్‌ నంగల్‌ షాకోట్‌లోని నంగల్ అంబియాన్ గ్రామానికి చెందినవాడని జలంధర్ (రూరల్) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (నాకోదర్) లఖ్వీందర్ సింగ్ తెలిపారు.

సందీప్‌ నంగల్ తన కుటుంబంతో సహా ఇంగ్లండ్‌లో స్థిరపడినా పంజాబ్‌లో కబడ్డీ టోర్నమెంట్‌లను నిర్వహించేవారు. టోర్నీ స్థలం నుంచి సందీప్ బయటకు రాగానే నలుగురు గుర్తుతెలియని దుండగులు అతడిపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. కబడ్డీ ప్లేయర్‌ సందీప్‌ శరీరంలోకి ఎనిమిది నుంచి 10 బుల్లెట్లు దిగగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో 10 ఖాళీ బుల్లెట్ షెల్స్‌ లభించాయని డీఎస్పీ తెలిపారు. సందీప్‌పై కాల్పులు జరిపిన తర్వాత, అతన్ని నకోదర్‌లోని ఆసుపత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.

కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా, శిరోమణి అకాలీదళ్ నాయకుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఈ హత్య దాడిని ఖండించారు. హంతకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ''కబడ్డీ క్రీడాకారుడు సందీప్ నంగల్ అంబియాన్‌పై జరిగిన హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. అతని అకాల మరణం కబడ్డీ ప్రపంచానికి తీరని లోటు. సందీప్ కుటుంబానికి, కబడ్డీ ప్రేమికులకు సానుభూతి తెలియజేస్తున్నాను, హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాను" అని పంజాబీలో ట్వీట్ చేశాడు.

Next Story