ఇద్దరు మగవాళ్ల మధ్య ప్రేమ.. టీచర్ ఆత్మహత్య
Indore Teacher Himanshu Sharma committed suicide.ప్రేమను నిర్వచించలేం. ఇది ఎప్పుడు ఎవ్వరి మధ్య పుడుతుందో
By తోట వంశీ కుమార్
ప్రేమను నిర్వచించలేం. ఇది ఎప్పుడు ఎవ్వరి మధ్య పుడుతుందో ఎవ్వరూ చెప్పలేము. ఇటీవల కాలంలో స్వలింగ సంపర్కుల మధ్య ప్రేమ ఎక్కువగా చిగురిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఇద్దరు మగవాళ్లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పురుషులు ప్రేమించుకున్నారు. అయితే.. అందులో ఓ అబ్బాయికి ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయం కావడంతో మరో అబ్బాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడింది సమాజంలో గౌరవప్రద వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుడు కావడం గమనార్హం. ఈ ఘటన ఇండోర్‌లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇండోర్‌కు చెందిన హిమాన్షు శర్మ ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతడికి పక్కగ్రామం బీజల్‌పూర్‌కు చెందిన అమన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. అయితే.. వీరి ప్రేమకు సమాజం, పెద్దలు అడ్డుచెప్పారు. విషయం అమన్ కుటుంబ సభ్యులకు తెలిసింది. అప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమన్‌ను కటుంబ సభ్యులు బెదిరించారు. అప్పటి నుంచి అమన్.. హిమాన్షు వద్దకు రావడం మానేశాడు.
అయితే.. అమన్‌ను వదిలి ఉండడం హిమాన్షుకు ఇష్టం లేదు. దీంతో అతడి కోసం అతడి ఇంటికి వెళ్లాడు. అక్కడ హిమాన్షును అవమానించారు. అమన్ కూడా ఇక తన వద్దకు రావద్దు అని గట్టిగా చెప్పాడు. అమన్ చెప్పిన మాటలతో హిమాన్షు తీవ్ర మనస్థాపం చెందాడు. సరిగ్గా భోజనం చేసేవాడు కాదు. టీచర్ ఉద్యోగానికి కూడా వెళ్లడం మానేశాడు. ఈ క్రమంలో ఓ రోజు అమన్.. హిమాన్షు కు ఫోన్ చేసి ఓ అమ్మాయితో తనకు పెళ్లి జరగబోతుందని చెప్పాడు. ఈ మాటలను హిమాన్షు తట్టుకోలేకపోయాడు. హిమాన్షు లేని జీవితం తనకు వద్దని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.