బాల్క‌నీలో వెక్కివెక్కి ఏడుస్తున్న చిన్నారి.. పోలీసులు వ‌చ్చి చూడ‌గా..

Indian techie pregnant wife found dead in US.అమెరాకాలోని న్యూ జెర్సీలో భార‌త్‌కు చెందిన దంప‌తులు అనుమానాస్ప‌ద మృతి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 April 2021 5:43 AM GMT
India woman dead in US

ఓ చిన్నారి బాల్క‌నీలో నిల‌బ‌డి వెక్కి వెక్కి ఏడుస్తోంది. దీనిని గ‌మ‌నించిన కొంద‌రు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. వారు వ‌చ్చి త‌లుపులు కొట్ట‌గా ఇంటి లోప‌లి నుంచి గ‌డియ పెట్టి ఉంది. వారు ఆ త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టి చూడ‌గా.. అక్క‌డ క‌నిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నారు. ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు ర‌క్త‌పుమ‌డుగులో ప‌డి ఉన్నారు. ఈ ఘ‌ట‌న అమెరాకాలోని న్యూ జెర్సీలో జ‌రిగింది. మృతులను భార‌త్‌కు చెందిన దంప‌తులుగా గుర్తించారు.

వివ‌రాల్లోకి వెళితే.. మహారాష్ట్ర‌లోని బీద్ జిల్లాలో బాలాజీ(32), ఆర్తి(30) దంప‌తులు నివాసం ఉండేవారు. వీరికి నాలుగేళ్ల కుమారై ఉంది. బాలాజీ ఐటీ ఉద్యోగి కావ‌డంతో.. 2015లో ఉద్యోగ రీత్యా కుటుంబంతో క‌లిసి అమెరికా వెళ్లాడు. న్యూ జెర్సీలోని నార్త్ ఆర్లింగ్ట‌న్ లో నివాసం ఉంటున్నాడు. ప్ర‌స్తుతం ఆర్తి ఏడు నెల‌ల గ‌ర్భిణీ. అయితే.. అమెరికా కాల‌మానం ప్ర‌కారం.. బుధ‌వారం బాలాజీ కుతురు వారి ఇంటి బాల్క‌నీలో నిలుచుని వెక్కి వెక్కి ఏడుస్తూ క‌నిపించింది. చాలా సేప‌టి నుంచి చిన్నారి ఏడుస్తుండ‌డంతో అనుమానం వ‌చ్చిన ప‌క్కింటి వారు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు పోలీసులు. అయితే.. త‌లుపు లోప‌లి నుంచి గ‌డియ పెట్టి ఉంది.

వారు త‌లుపుల‌ను ప‌గ‌ల‌కొట్టి లోప‌లికి వెళ్లి చూడ‌గా... బాలాజీ దంప‌తులు ర‌క్త‌పుమ‌డుగులో క‌నిపించారు. ఇద్ద‌రి శ‌రీరాల‌పై బ‌ల‌మైన క‌త్తిపోట్లు ఉన్నాయి. అనుమానాస్ప‌ద మృతి కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే.. బాలాజీ తొలుత భార్య ఆర్తిని చంపి త‌రువాత తాను ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉండొచ్చున‌ని అమెరికా మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే.. పోస్టుమార్టం రిపోర్టు వ‌స్తే గాని అస‌లు నిజం చెప్ప‌లేమ‌ని పోలీసులు అంటున్నారు. కాగా.. మ‌హారాష్ట్ర‌లో బాలాజీ కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం ఇచ్చారు. ప్ర‌స్తుతం ఆ చిన్నారి బాలాజీ స్నేహితుడి సంర‌క్ష‌ణ‌లో ఉంది.


Next Story
Share it