తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో విషాద ఘటన వెలుగు చూసింది. ప్రేమించిన యువకుడే పెళ్లి పేరుతో ఒత్తిడి చేశాడు. యువతి నిరాకరించడంతో అత్యాచారం చేసి, ఆ తర్వాత చున్నీతో మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. ఈ నెల 5న ఇంట్లో నుంచి వెళ్లిన యువతి హత్యాచారానికి గురైంది. యువతిపై అత్యాచారం, ఆ తర్వాత హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. మైలార్‌దేవ్‌పల్లికి చెందిన యువతి డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలోనే యువతికి వనపర్తి జిల్లా ఖిల్లాఘపూర్ మండలం మానాజీపేటకు చెందిన దూరపు బంధువు శ్రీశైలంతో స్నేహం ఏర్పడింది.
కొన్ని రోజుల తర్వాత శ్రీశైలం పెళ్లి చేసుకుంటానని చెప్పగా.. యువతి తండ్రి నిరాకరించాడు. అయితే శ్రీశైలం మాత్రం యువతిని పెళ్లి పేరుతో వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. ఈ నెల 5న యువతికి నచ్చజెప్పేందుకు మానాజీపేటకు తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి పెళ్లి విషయం గురించి మాట్లాడాడు. తనను మరిచిపోవాలని యువతి పలుమార్లు చెప్పింది. దీంతో యువతి అత్యాచారం చేసిన శ్రీశైలం.. ఆవేశంలో ఆమె చున్నీని మెడకు బిగించి ఊపిరాడకుండా చంపేశాడు. అనంతరం తన మేనత్త కుమారుడు శివ సాయంతో సమీపంలోని కాల్వ పక్కనే మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు.
యువతి కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు శ్రీశైలంపై అనుమానం వచ్చింది. విషయాన్ని పక్కదారి పట్టించేలా.. యువతి ఫోన్ నుంచి ఆమె తండ్రికి మెసేజ్ చేశాడు. వేరొకి యువకుడిని లవ్ చేశానని, అతనితో వెళ్తున్నానని మెసేజ్‌లో పేర్కొన్నాడు. మానాజీపేటకు వెళ్లిన పోలీసులు శ్రీశైలంను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంతో నిందితుడు నేరం అంగీకరించాడు. యువతి మృతదేహాన్ని వెలికితీసి ఎమ్మార్వో సమక్షంలో పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబసభ్యులకు అప్పజెప్పారు.