ఐ బొమ్మ రవి కస్టడీ రిపోర్ట్‌లో సంచలన నిజాలు

ఆన్‌లైన్ మూవీ పైరసీ కేసులో అరెస్టైన ఐ బొమ్మ రవి కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

By -  అంజి
Published on : 31 Dec 2025 2:11 PM IST

iBomma, piracy probe, Police, forged identity, iBomma Ravi, Hyderabad

ఐ బొమ్మ రవి కస్టడీ రిపోర్ట్‌లో సంచలన నిజాలు 

హైదరాబాద్‌: ఆన్‌లైన్ మూవీ పైరసీ కేసులో అరెస్టైన ఐ బొమ్మ రవి కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 12 రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉన్న రవి ఇచ్చిన వివరాలతో అధికారులు షాక్‌ అవుతున్నారు. గత మూడు సంవత్సరాల్లోనే రవి సుమారు రూ.13.40 కోట్ల వరకు సంపాదించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మొత్తంలో సుమారు రూ.10 కోట్లు విలాసవంతమైన జీవనశైలికి ఖర్చు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రవి సుమారు రూ.10 కోట్లు విలాసవంతమైన జీవనశైలికి ఖర్చు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

హైఫై పబ్‌లు, ఫైవ్ స్టార్ హోటళ్లలోనే బస చేస్తూ బిందాస్ లైఫ్ గడిపినట్టు విచారణలో రవి అంగీకరించాడు. ప్రస్తుతం రవి బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. 2007 నుంచే పైరసీ చేయాలనే ఆలోచన రవికి ఉన్నట్టు పోలీసులు కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అదే ఏడాది నుంచి తన స్నేహితుల సర్టిఫికెట్లు, ఐడెంటిటీ ప్రూఫ్‌లు దొంగలిస్తూ వచ్చాడని వెల్లడించారు. తన స్నేహితులైన ప్రహ్లాద్, అంజయ్య, కాళీ ప్రసాద్ల డాక్యుమెంట్లు దొంగిలించి, వారికి తెలియకుండానే ఫోటోలు మార్చి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించాడు. ప్రహ్లాద్ డాక్యుమెంట్లతోనే రవి డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రామగుండం కు చెందిన అంజయ్య పరారీలో ఉన్నాడు.

స్నేహితుల పేర్ల మీదే రవి మూడు కంపెనీలను స్థాపించాడు. Supplier India, Hospital Inn, ER Infotech.. ఈ కంపెనీలన్నీ స్నేహితులకు తెలియకుండానే వారి ఐడెంటిటీ ప్రూఫ్‌లతో రిజిస్టర్ చేసినట్లు విచారణలో తేలింది.టెలిగ్రామ్ ద్వారా తండెల్, కిష్కిందపురి వంటి సినిమాలను తీసుకున్నట్టు రవి అంగీకరించాడు. సినిమాలను రెండు రకాలుగా కొనుగోలు చేసినట్లు రవి చెప్పాడని పోలీసులు తెలిపారు. క్యామ్‌కాడర్ ప్రింట్‌కు ఒక్కో సినిమాకు 100 డాలర్లు, HD ప్రింట్‌కు 200 డాలర్లు చెల్లించినట్లు వెల్లడైంది. కోవిడ్ తర్వాత ఆన్‌లైన్‌లో సినిమాలు చూసే వారి సంఖ్య పెరగడంతో తన బిజినెస్ భారీగా పెరిగిందని రవి చెప్పాడు.మొత్తం 7 బ్యాంక్ ఖాతాలకు రూ.13.40 కోట్లు వచ్చాయని పోలీసులు గుర్తించారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్ ద్వారా ఒక్కసారి ఏకంగా రూ.1.78 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. ట్యాక్స్ సమస్యలు రాకుండా ఉండేందుకు తన సోదరి చంద్రికకు రూ.90 లక్షలు పంపినట్లు విచారణలో తేలింది.లావాదేవీలన్నీ ఎక్కువగా విదేశీ కరెన్సీ రూపంలో నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. కూకట్పల్లి ఉషా ముల్లపూడి సమీపంలో కొంతకాలం ఆఫీస్ నడిపిన రవి, దాదాపు 10 మందిని నియమిం చుకుని పైరసీ కార్యకలా పాలు నిర్వహించినట్లు వెల్లడైంది.రాకేష్ అనే విదేశీయుడి ద్వారా ట్రేడ్‌మార్క్ లైసెన్స్ కూడా పొందినట్టు పోలీసులు గుర్తించారు.బెట్టింగ్, పైరసీ ద్వారా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపిన ఐ బొమ్మ రవిని, 12 రోజుల కస్టడీ అనంతరం పోలీసులు జైలుకు తరలించారు.

Next Story