మరదలితో తిరుగుతున్నాడని.. స్నేహితులతో కలిసి యువకుడి హత్య

తన మరదలిని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని దారుణంగా హత్య చేశాడు యువతి బావ.

By Srikanth Gundamalla  Published on  26 Jun 2024 10:26 AM IST
Hyderabad, murder,  love, crime

మరదలితో తిరుగుతున్నాడని.. స్నేహితులతో కలిసి యువకుడి హత్య

హైదరాబాద్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తన మరదలిని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని దారుణంగా హత్య చేశాడు యువతి బావ. ముగ్గురు స్నేహితులతో కలిసి.. విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి చంపేశాడు. నగరంలో ఈ హత్య కలకలం రేపుతోంది.

హైదరాబాద్‌లోని బేగంపేట పరిధిలో ఈ హత్య జరిగింది. నలుగురు వ్యక్తులు కలిసి కత్తులతో యువకుడిని హత్య చేశారు. తీవ్రంగా రక్తస్రావం అయిన యువకుడు సంఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. పాటిగట్ట ప్రాంతానికి చెందిన ఉస్మాన్ అనే యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. అయితే.. ఈ ప్రేమ వ్యవహారం యువతి బావ అయిన అజాజ్‌ తెలిసింది. అతనికి ఇది నచ్చలేదు. దాంతో.. ఉస్మాన్‌పై కోపం పెంచుకున్నాడు. అతన్ని ఎలాగైనా తన మరదలి నుంచి దూరం చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ముగ్గురు స్నేహితులతో కలిసి ప్లాన్ చేసుకున్నాడు.

నలుగురు ప్లాన్ వేసి మంగళవారం ఉస్మాన్ ఒక్కడే ఉన్న సమయంలో దాడి చేశారు. తీవ్రంగా కొట్టి తమ వెంట తెచ్చుకున్న కత్తులతో దాడి చేశారు. ముఖంపై విచక్షణారహితంగా పొడిచారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలై.. రక్తస్రావంతో ఉస్మాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. హత్య తర్వాత నిందితులు నలుగురూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story