ఇటలీలో శవమై కనిపించిన హైదరాబాద్ విద్యార్థి
Hyderabad student found dead in Italy. ఇటలీలో శవమై కనిపించిన హైదరాబాద్ విద్యార్థి
By అంజి Published on 9 Nov 2022 12:21 PM ISTహైదరాబాద్: సికింద్రాబాద్ పద్మారావు నగర్‌కు చెందిన పి.ఉదయ్ కుమార్ (28) ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేందుకు రోమ్‌లో ఇటలీ వెళ్లి అనుమానాస్పద పరిస్థితుల్లో తన గదిలో శవమై కనిపించాడు. దీంతో అతడి తల్లిదండ్రులు చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2018లో ఉదయ్ కుమార్ మొదటిసారిగా ఇటలీకి వెళ్లి రోమ్‌లోని సపియెంజా విశ్వవిద్యాలయంలో తన ఎంఎస్ పూర్తి చేశాడు. అతను 2020లో కరోనా మహమ్మారి మధ్యలో నగరానికి తిరిగి వచ్చాడు. తదుపరి విద్యను అభ్యసించడానికి అతను 2021లో ఇటలీలోని రోమ్‌కి తిరిగి వెళ్లాడు. హైదరాబాద్‌కు చెందిన అతని తల్లిదండ్రులు నవంబర్ 4వ తేదీన తమ కుమారుడి మరణాన్ని ఇమెయిల్ ద్వారా తెలుసుకున్నారు.
అతని రూమ్‌మేట్స్, ఇతర స్నేహితులను కుటుంబ సభ్యులు సంప్రదించారు. కానీ ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో విశ్రాంత రైల్వే ఉద్యోగి పి రామచంద్రు, పి రాజేశ్వరి తల్లిదండ్రులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి సమస్యను వివరించి, మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకురావడానికి సహకరించాలని కోరారు. అతని మరణానికి గల కారణాన్ని నిర్ధారించడానికి, అతని మృతదేహాన్ని వీలైనంత త్వరగా నగరానికి తీసుకురావడానికి అవసరమైన సహాయాన్ని అందిస్తానని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. ఇటలీలోని భారత రాయబార కార్యాలయ ప్రతినిధులతోనూ ఆయన సంభాషణలు జరిపారు.