గణనాథుడి దర్శనానికి వెళ్తూ ఇద్దరు యువకులు మృతి
ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి దర్శనానికి వెళ్తూ రోడ్డుప్రమాదం బారిన పడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 2:13 PM ISTగణనాథుడి దర్శనానికి వెళ్తూ ఇద్దరు యువకులు మృతి
హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి దర్శనానికి వెళ్తూ రోడ్డుప్రమాదం బారిన పడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వినాయకుని దర్శనానికి బయల్దేరిన యువకులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
హైదరాబాద్‌లోని బోడుప్పల్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ 20వ డివిజన్ కాంటెస్టడ్ కార్పొరేటర్ తోటకూర మల్లేష్ యాదవ్ కుమారుడు యశ్వంత్ యాదవ్ (22) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. యశ్వంత్ తన స్నేహితుడు సాయిరాంతో కలిసి రాత్రి 2 గంటల సమయంలో ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు బయల్దేరారు. అయితే.. రాంనగర్ ఫ్లై ఓవర్ వద్ద బైక్ ఒక్కసారిగా అదుపుతప్పింది. దాంతో.. ఇద్దరూ కిందపడిపోయారు. బైక్ వేగంగా ఉన్న కారణంగా కిందపడ్డ యశ్వంత్, సాయిరాంలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో అక్కడికక్కడే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరికీ తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయని.. అందుకే ఇద్దరూ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్నాక ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి మార్చురీకి తరలించామని వెల్లడించారు.
కాగా.. యువకుల అకాల మరణంతో బోడుప్పల్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. మృతిచెందిన యువకుడు యశ్వంత్ యాదవ్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్‌కు మనవడు అవుతాడని సమాచారం. ఈ సంఘటనపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.