Hyderabad: అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు.. 11 మంది అరెస్ట్
హైదరాబాద్ నగర శివారులో అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
By అంజి Published on 28 May 2024 12:43 PM GMTHyderabad: అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు.. 11 మంది అరెస్ట్
హైదరాబాద్ నగర శివారులో అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మేడిపల్లిలో పిల్లల్ని అమ్ముతున్నట్లుగా విశ్వసనీయమైన సమాచారం రావడంతో రాచకొండ పోలీసులు దాడులు చేసి 11 సభ్యులు గల ముఠాను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఏకంగా 16 మంది చిన్నారులను రక్షించారు. ఈనెల 22వ తేదీన ఓ ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఓ పసికందును విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. శోభారాణి, స్వప్న, షేక్ సలీమ్ ఈ ముగ్గురు కలిసి మేడిపల్లి పరిధిలో ఓ పసికందును విక్రయిస్తున్న సమయంలో పోలీసులు రంగంలోకి దిగి ఈ ముగ్గురిని అరెస్టు చేసి పసికందును రక్షించారు.
అనంతరం పోలీసులు శోభారాణి ,స్వప్న, షేక్ సలీమ్ లను తమదైన స్టైల్ లో విచారణ చేయడంతో విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బండారి హరిహర చేతన్ అనే వ్యక్తితో కలిసి అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పడి శిశువులను విక్రయిస్తున్నట్లుగా వెల్లడించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వీరందరి కోసం వేట కొనసాగించారు. నిన్న శోభారాణి, హేమలత అలియాస్ స్వప్న, షేక్ సలీం, ఘట్కేసర్ లోని అన్నోజి గుడాకు చెందిన బండారు హరిహర చేతన్ అలియాస్ హరి (34), బండారి పద్మ(65), బలగం సరోజ(32), ముదావత్ శారద (39), ముదావత్ రాజు(30), పటాన్ ముంతాజ్ అలియాస్ హసీనా( 28), జగనాథం అనురాధ(27), యాత మమత(30) లను పోలీసులు అరెస్టు చేశారు.
వీరిని విచారించగా కిరణ్, ఢిల్లీకి చెందిన ప్రీతి, పూణేకి చెందిన కన్నయ్య తో కలిసి ఇతర రాష్ట్రాల నుండి పిల్లల్ని తీసుకువచ్చి హైదరాబాదు నగరంలో అవసరమైన వారికి విక్రయిస్తున్నట్లుగా వెల్లడించారు. ఒక్కొక్క శిశువుకు 50 వేల నుండి లక్ష రూపాయల వరకు లాభం వస్తుందని పోలీసులు ఎదుట చెప్పారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని వివిధ ప్రాంతా ల్లో శిశువులను అపహరించి అవసరమైన వ్యక్తులకు విక్రయించామని.. మధ్య వర్తుల సహకారంతో 1,80,000 నుండి 5,50,000 వరకు శిశువులను విక్రయించినట్లుగా పోలీసులు ఎదుట వెల్లడించారు. పోలీసులు 11 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీ లో ఉన్న కిరణ్, ప్రీతి, కన్నయ్య వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టామని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు.