Hyderabad: లోన్‌యాప్‌ వేధింపులకు ఓ యువకుడు బలి

లోన్‌ యాప్‌లను నమ్మొద్దని పోలీసులు పదే పదే హెచ్చరిస్తుంటారు

By Srikanth Gundamalla  Published on  21 Dec 2023 4:31 PM IST
hyderabad, loan app, suicide, crime news,

Hyderabad: లోన్‌యాప్‌ వేధింపులకు ఓ యువకుడు బలి

లోన్‌ యాప్‌లను నమ్మొద్దని పోలీసులు పదే పదే హెచ్చరిస్తుంటారు. కానీ.. డబ్బులు అత్యవసరం ఉన్నవారు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా యాప్‌ల నుంచి లోన్లు తీసుకుంటున్నారు. తిరిగి చెల్లించే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొని.. వేధింపులకు గురవుతున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా చూశాం. చాలా మంది ప్రాణాలను సైతం బలి తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని మధురానగర్‌లో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.

లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అతని కుటుంబంలో విషాదాన్ని నింపింది. మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరికి చెందిన శివ (29) అనే యువకుడు జీవినోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక్కడే మధురానగర్‌ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. యువకుడు శివ తన అవాసరాల కోసం పలు యాప్స్‌ ద్వారా లోన్లు తీసుకున్నాడు. తీసుకున్న రుణాన్ని చెల్లించే విషయంలో కాస్త వాయిదాలు పడ్డాయి. దాంతో.. లోన్‌ యాప్‌ నిర్వాహకులు వేధింపులకు దిగారు. నిత్యం ఫోన్‌ కాల్స్ చేస్తూ వేధింపులు చేశారు. డబ్బులు కట్టకపోతే తన కాంటాక్ట్‌లో ఉన్న వారందరికీ మెసేజ్‌లు చేస్తామని బెదిరించారు.

యువకుడు గురించి తప్పుగా ప్రచారం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే లోన్‌ యాప్ నిర్వహికులు బెదిరంచడం కంటిన్యూ చేశారు. దాంతో విసిగిపోయిన యువకుడు శివ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఏం చేయాలో తెలియక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటికే శివ ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లారు. తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా.. లోన్‌ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు.


Next Story