లవ్‌ బ్రేకప్‌ చెప్పిందని కారులో యువతిపై కత్తితో దాడి

ప్రేయసి బ్రేకప్‌ చెప్పిందని ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.

By Srikanth Gundamalla  Published on  5 Nov 2023 12:47 PM IST
hyderabad, kushaiguda, attack,  breakup,

లవ్‌ బ్రేకప్‌ చెప్పిందని కారులో యువతిపై కత్తితో దాడి

కొన్నాళ్లు ప్రేమించుకోవడం.. ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోవడం ఈ రోజుల్లో కామన్‌గా జరుగుతోంది. అయితే.. కొందరు లైట్ తీసుకుని విడుపోతుంటే.. కొందరు మాత్రమే మనసులో కక్ష పెంచుకుని దాడులకు పాల్పడుతున్నారు. హత్యలు చేసేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి దారుణ సంఘటనే జరిగింది. ప్రేయసి బ్రేకప్‌ చెప్పిందని ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.

హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డీఏఈ కాలనీకి చెందిన వంశీ అనే యువకుడు, మౌలాలి ఎంజే కాలనీకి చెందిన యువతి చిన్నప్పటి నుంచి మిత్రులే. ఇద్దరూ ఒకే స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత కాలేజ్‌ కూడా ఒకే దగ్గర చేరారు. చిన్నప్పటి స్నేహం వారిని దగ్గర చేసింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. ప్రస్తుతం వీరు కీసరలోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నారు. అయితే.. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. యువతి వంశీకి లవ్‌ బ్రేకప్‌ చెప్పింది. దాంతో.. అది మనసులో పెట్టుకున వంశీ యువతిపై కక్ష పెంచుకున్నాడు. ఆ తర్వాత మాజీ ప్రేయసిని చంపి.. తానూ చనిపోవాలని అనుకున్నాడు.

శనివారం రోజు యువతికి వంశీ కాల్‌ చేశాడు. ఒకసారి మాట్లాడాలంటూ బతిమాలాడు. దాంతో.. యువతి అతడి వద్దకు వెళ్లింది. కారులో వచ్చిన వంశీ యువతిని అందులోనే ఎక్కించుకుని ఓ మూలన పార్క్‌ చేశాడు. ఆ తర్వాత అద్దాలను పైకి ఎక్కించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎందుకు బ్రేకప్‌ చెబుతున్నావంటూ ప్రశ్నించాడు. ఆ తర్వాత కాసేపటికే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలోనే వంశీ తనతో పాటు తెచ్చుకున్న కత్తిని ఒక్కసారిగా బయటకు తీసి యువతిపై దాడి చేశాడు. విచక్షనా రహితంగా పొడవడం మొదలుపెట్టాడు. దాంతో.. యువతి ప్రాణభయంతో గట్టిగా కేకలు వేసింది. యువతిని పొడిచిన తర్వాత వంశీ తనకు తానే కడుపులో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

కేకలు విన్న స్థానికులు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే కారు దగ్గరకు వెళ్లారు. కారులో గాయాలతో ఉన్న ఇద్దరినీ గమనించి అద్దాలను పగలగొట్టారు. చికిత్స కోసం ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి బాగానే ఉందని.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Next Story