దారుణం.. పొయ్యిపై పాలు విరిగాయని భార్యను చితకబాదిన భర్త
అదనపు కట్నం కోసం కొందరు మహిళలను వేధిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 30 May 2024 1:45 PM ISTదారుణం.. పొయ్యిపై పాలు విరిగాయని భార్యను చితకబాదిన భర్త
అదనపు కట్నం కోసం కొందరు మహిళలను వేధిస్తున్నారు. అత్తారింటిపై ఎన్నో కలలు పెట్టుకుని వెళ్తే.. డబ్బులు.. బంగారం తీసుకురావాలంటూ భర్త, అత్తవారు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పొయ్యి మీద వేడి చేసిన పాలు విరిగాయన్న నెపంతో మహిళపై ప్రతాపం చూపించారు. భర్తతో పాటు అత్త, అతని సోదరి తీవ్రంగా కొట్టారు.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్ అల్లావుద్దీన్ కోఠికి చెందిన హీనా బేగం (28) యువతికి ఎల్లారెడ్డిగూడకు చెందిన కారు డ్రైవర్ అక్మల్ హుస్సేన్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం అయ్యింది. పెళ్లి సమయంలో రూ.2లక్షల కట్నం, నాలుగున్నర తులాల బంగారం, ఇతర లాంచనాలు కట్నకానుకలుగా ఇచ్చి వివాహం జరిపించారు. అయితే.. అక్మల్‌కు మొదటి పెళ్లి పెటాకులంఐది. ఈ విషయం దాచి రెండో వివాహం చేశారు. ఆ తర్వాత హీనా బేగంగా ఇది తెలిసినా సర్దుకుపోయింది. కానీ.. అదనపు కట్నం కోసం మాత్రం అత్తింటివారు వేధించసాగారు.
పెళ్లయి నప్పటి నుండి భర్త అక్మల్ హుస్సేన్, అత్త అఫ్రోజ్ బేగం, ఆడపడుచు సోనీ, మరుదులు తబ్రేజ్,అయ్యూబ్లు కలిసి ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురి చేసేవారు. అదనపు కట్నం తేవాలంటూ చీటికిమాటికి కొట్టేవారు. విషయం తెలుసుకున్న తండ్రి... బిడ్డ కాపురం బాగుం డాలని ఆ తండ్రి అప్పు చేసి రెండున్నర లక్షలు అత్తింటి వారికి ముట్ట చెప్పారు. అయినా కూడా వారి కట్న దాహం తీరలేదు. మళ్లీ హీనా బేగంను చిత్రహింసలకు గురి చేస్తూనే ఉన్నారు. ఇటీవల అత్తింట్లో పొయ్యి పై పాలు వేడి చేసి మరిగి స్తున్న సమయంలో విరిగిపోయాయి. ఇది కూడా సాకుగా చూపిన అత్తింటి కుటుంబ సభ్యులు హీనాపై మళ్లీ దాడి చేశారు. భర్త అయితే ఏకంగా మెటల్ పైపుతో దాడి చేసి పైశాచిక ఆనందాన్ని పొందాడు. దాంతో.. హీనా బేగం అపస్మారక స్థితిలోకి వెళ్లింది. హీనా చనిపోయిందని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. ఇక ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందిన తర్వాత కోలకుంటుంది. ఈ మేరకు హీనా బేగం, ఆమె తల్లిదండ్రులు వరకట్నం వేధింపులు చేస్తున్నారని భర్తతో పాటు అత్త, ఆడపడుచు, మరుదులపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.