హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. రెస్టారెంట్‌ మేనేజర్‌ మృతి

మియాపూర్‌లో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. ఓ హోటల్ జనరల్ మేనేజర్‌ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

By అంజి  Published on  24 Aug 2023 6:55 AM IST
Hyderabad, Hotel manager, shot dead, Miyapur

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. రెస్టారెంట్‌ మేనేజర్‌ మృతి

హైదరాబాద్: మియాపూర్‌లో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. ఓ హోటల్ జనరల్ మేనేజర్‌ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మృతుడు దేవేందర్‌నాథ్ గేయెన్ (35) మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడలోని సందర్శిని ఎలైట్ హోటల్‌లో పనిచేస్తున్నాడు. రాత్రి 9:40 గంటలకు దేవేందర్‌నాథ్ హోటల్ నుంచి బయటకు రాగానే హెల్మెట్ ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి అతడిపై 5 రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడని డీసీపీ మాదాపూర్ జి సందీప్ తెలిపారు. దేవేందర్‌కు గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం క్లూల కోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేవేందర్‌ స్వస్థలం కోల్‌కతా అని పోలీసులు తెలిపారు. కాల్పులకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పాత కక్షల కారణంగానే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. ఇదిలా ఉంటే.. నిన్న పాతబస్తీ హుస్సేనీ ఆలం పోలీస్‌ స్టేషన్‌ ఔట్‌పోస్టు దగ్గర హెడ్‌ కానిస్టేబుల్‌ చేతిలోని తుపాకీ మిస్‌ఫైర్‌ అయ్యింది. కబుతర్ఖాన ప్రాంతంలో రాత్రి విధులు ముగించుకుని నిద్రించే క్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ భూపతి శ్రీకాంత్‌ చేతిలోని తుపాకీ మిస్‌ ఫైర్‌ అయ్యింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.రక్తపు మడుగులో పడిఉన్న శ్రీకాంత్‌ను గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శ్రీకాంత్‌ మృతి చెందాడు.

Next Story