హైదరాబాద్: నెలవారీ జీతం ఇవ్వకపోవడంతో బ్యాంకు ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వద్ద పనిచేస్తున్న హోంగార్డు మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్రినాక ఉప్పుగూడకు చెందిన ఎం రవీందర్ (36) చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. అతని భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతడికి నెలవారీ వేతనాలు సకాలంలో అందడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతి నెలా బ్యాంక్ లోన్ ఈఎంఐని ప్రతి నెల 5వ తేదీన చెల్లించేలా పెట్టుకున్నాడు.
ఈ క్రమంలోనే మంగళవారం నాడు సాయంత్రం, రవీందర్ (హెచ్‌జి 8025) గోషామహల్ పోలీస్ స్టేడియం సమీపంలోని కమాండెంట్ హోంగార్డు కార్యాలయానికి వచ్చి జీతం చెల్లింపు గురించి ఆరా తీసేందుకు ప్రయత్నించాడు. సంబంధిత అధికారుల నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అకస్మాత్తుగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడికక్కడే ఉన్నవారు సకాలంలో జోక్యం చేసుకోవడంతో అతడి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటనలో ట్రాఫిక్ హోంగార్డుకు కాలిన గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందని తెలిసింది. షా ఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.