Hyderabad: అమానుషం.. పెంపుడు కుక్క విష‌యంలో గొడవ, దంపతులపై దాడి

హైదరాబాద్‌లోని మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది.

By Srikanth Gundamalla
Published on : 16 May 2024 1:31 PM IST

hyderabad,  attack, husband and wife,  pet dog dispute,

 Hyderabad: అమానుషం.. పెంపుడు కుక్క విష‌యంలో గొడవ, దంపతులపై దాడి

హైదరాబాద్‌లోని మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. పెంపుడు కుక్క విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ దారుణానికి దారి తీసింది. ఓ కుటుంబ సభ్యులపై కొందరు వ్యక్తులు కర్రలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రహమత్‌ నగర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఈ దాడి జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనాథ్‌, ధనుంజయ్‌ ఎదురెదురు ఇళ్లలో నివాసం ఉంటున్నారు. శ్రీనాథ్‌కు పెంపుడు కుక్క ఉంది. అయితే.. ఈ నెల 8న ఉదయం శ్రీనాథ్‌, అతని భార్య స్వప్న పోస్టల్‌ బ్యాలెట్‌ వేసేందుకు వెళ్తుండగా ధనుంజయ్‌ని చూసి శ్రీనాథ్‌ కుక్క మొరిగింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఘర్షన పెద్ది అయ్యాక వారు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక దీన్ని ధనుంజయ్‌ మనుసులో పెట్టుకున్నాడు. మే 14వ తేదీన సాయంత్రం తన కుక్కను తీసుకుని వచ్చి వీధిలో నిలబడ్డ శ్రీనాథ్‌పై ధనుంజయ్‌ నలుగురితో కలిసి దాడికి పాల్పడ్డాడు. ముందే పథకం ప్రకారం ధనుంజయ్‌ ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. భర్తపై దాడి జరుగుతుండగా చూసిన భార్య స్వప్న అడ్డుకునేందుకు వస్తే.. ఆమెను కూడా చావబాదారు. శ్రీనాథ్‌, అతని భార్య కిందపడిపోయినా కూడా వదిలిపెట్టకుండా తీవ్రంగా దాడి చేశారు. కర్రలతో పాటు రాళ్లను వారిపైకి విసిరేశారు. దంపతులపై దాడి చేస్తుండటంతో స్థానికులు కొందరు అందుకునే ప్రయత్నం చేస్తే.. వారిపై కూడా ధనుంజయ్‌ అతని మనుషులు దాడికి పాల్పడ్డారు. మరోవైపు కుక్క ఇంట్లోకి పారిపోగా.. వదలకుండా కర్రలతో కుక్కను కూడా కొట్టారు. ఈ అమానుష సంఘటనకు సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

కాగా.. ఈ దాడి ఘటనలో శ్రీనాథ్‌ పరిస్థితి విషమంగా ఉంది.. స్వప్నకు కాళ్లు, చేతులు విరిగాయి. ఇక శ్రీనాథ్‌ సోదరుడు ఫిర్యాదు మేరకు మధురానగర్‌ పోలీసులు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు పోలీసులు.

Next Story