దారుణం.. భుజం తగిలించాడని యువకుడి హత్య
చిన్న చిన్న విషయాలకు కోపాలకు పోయి యువత గొడవ పడుతుంటారు.
By Srikanth Gundamalla Published on 4 April 2024 12:48 PM ISTదారుణం.. భుజం తగిలించాడని యువకుడి హత్య
చిన్న చిన్న విషయాలకు కోపాలకు పోయి యువత గొడవ పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో క్షణికావేశానికి లోనై దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. చిన్న గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. పాన్ షాప్ వద్దకు వెళ్లిన ఓ యువకుడు జనాలు ఉండటంతో మరో యువకుడికి భుజం తగలించాడు. అనుకోకుండానే ఈ సంఘటన జరిగింది. కానీ.. అతను గొడవ పెట్టుకుని మరీ దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత సదురు యువకుడిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు.
అంబేడ్కర్ నగర్‌లో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. రాజు, యాదమ్మ దంపతులకు బి.తరుణ్ అనే ఇంటర్ చదువుతున్న కుమారుడు ఉన్నాడు. మంగళవారం రాత్రి తరుణ్ స్థానిక శివాలయం దగ్గర ఉన్న ఓ పాన్ షాపు వద్దకు వెళ్లాడు అక్కడే ఉన్న మరో యువకుడికి తరుణ్ భుజం తగిలింది. దాంతో.. ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. సదురు యువకుడు మరో ముగ్గురిని తీసుకొచ్చి తరుణ్‌పై దాడి చేశాడు. మొత్తం నలుగురు కలిసి తరుణ్‌ను ఒక్కడిని చేసి కొట్టారు. అంతటితో ఆగకుండా తమ గదికి వెళ్లి కత్తి తీసుకొచ్చి తరుణ్‌ను పొడిచారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ తరుణ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గమధ్యలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇక మృతుడి తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విచారణలో భాగంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన శివశంకర్, తరుణ్, జహీరాబాద్‌కు చెందిన పండు, సాయికిరణ్ హైదరాబాద్‌కు ఉద్యోగం కోసం వచ్చారు. ఈ నెల 1న అంబేడ్కర్ నగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలోనే పాన్ షాపు వద్దకు వచ్చిన సాయి కిరణ్, బి.తరుణ్‌తో గొడవపెట్టుకున్నాడు. గొడవ పెద్దది చేసి తన ముగ్గురు స్నేహితులను పిలిపించి దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కత్తి తీసుకొచ్చి హత్య చేశాడు. నిందితులను పూర్తిస్థాయిలో విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.